పొదుపులో పోటాపోటీ!
ABN , Publish Date - May 15 , 2026 | 04:07 AM
పశ్చిమాసియా సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు మంత్రం దేశవ్యాప్తంగా పోటాపోటీగా సాగుతోంది. సీఎం, మంత్రుల వంటివారి కాన్వాయ్ ల తగ్గింపు నుంచి ఉద్యోగులకు ఇంటినుంచే పని దాకా రాష్ట్రాలు ఇంధన....
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు ఇంటి నుంచే పని
న్యూఢిల్లీ, మే 14: పశ్చిమాసియా సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు మంత్రం దేశవ్యాప్తంగా పోటాపోటీగా సాగుతోంది. సీఎం, మంత్రుల వంటివారి కాన్వాయ్ ల తగ్గింపు నుంచి ఉద్యోగులకు ఇంటినుంచే పని దాకా రాష్ట్రాలు ఇంధన పొదుపు చర్యలను ప్రకటిస్తున్నాయి. కార్లు, ఇతర వాహనాల వినియోగాన్ని త గ్గించి, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని.. అనవసరంగా బంగారం కొనుగోళ్లను నివారించాలని పిలుపునిస్తున్నాయి.
ప్రభుత్వ సిబ్బంది కోసం బస్సులు..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండురోజుల పాటు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోం) అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం గురువారం నిర్ణ యం తీసుకుంది. అంతేగాకుండా ప్రభుత్వం, అధికారులు నిర్వహించే సమావేశాల్లో 50శాతం ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని, అధికారిక వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ఆదేశించింది. విధుల్లో భాగంగా ప్రయా ణం చేసే అధికారులకు నెలవారీగా అనుమతించే పెట్రోల్ కోటాను 20శాతం తగ్గించింది. వచ్చే ఆరు నెల ల పాటు కొత్తగా వాహనాలేమీ కొనుగోలు చేయబోమని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఉండే 29 కాలనీల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు 58 ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపింది. ప్రజారవాణా వ్యవస్థల ద్వారా రాకపోకలు సాగించే ప్రభుత్వ ఉద్యోగులకు వాహన భత్యంలో 10శాతం ఇంక్రి మెంట్ ఇస్తామని ప్రకటించింది. రోడ్లపై రద్దీని తగ్గించి, ఇంధన పొదుపు సాధించేందుకు వీలుగా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల పనివేళలను మార్చాలని నిర్ణయించింది. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వారంలో ఒకరోజు మెట్రో డేగా పాటిస్తామని తెలిపింది.
బైక్‌పై అసెంబ్లీకి మహారాష్ట్ర సీఎం
పొదుపు చర్యల్లో భాగంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం తన కాన్వాయ్‌ను పక్కనపెట్టి.. బుల్లెట్ బైక్‌పై అసెంబ్లీకి వెళ్లా రు. అన్ని స్థాయిల్లో వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు. వారానికి ఒకరోజు ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించి ఆఫీసులకు రావాలని సూచించారు. మహారాష్ట్ర మంత్రు లు, అధికారుల విదేశీ పర్యటనలన్నీ రద్దు చేశారు. అత్యవసరమైతే తప్ప, అదీ ప్రత్యేక అనుమతితో మాత్రమే విదేశీ పర్యటనలకు వెళ్లాలని స్పష్టం చే శారు. మరోవైపు పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రి గడ్కరీ తన కాన్వాయ్‌ను తగ్గించుకున్నారు. గురువారం పుణె-పాల్కి హైవే పనులను బస్సులో ప్రయాణిస్తూ పరిశీలించారు. రాజస్థాన్‌లోని బికనేర్ పర్యటనకు రైలులో వెళ్లిన కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ స్థానికంగా ఎలక్ట్రిక్ ఆటోలో ప్రయాణించారు.
బంగారం కొనొద్దని ఐదుగురికి చెప్పండి..
తమ శాఖ పరిధిలో పొదుపు చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. తన కాన్వాయ్‌ను మూడు వాహనాలకే పరిమితం చేసుకున్నారు. శాఖ పరిధిలో ఇంటి నుంచే పని విధానం అమలుపై రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అనవసరంగా బంగారం కొనవద్దని, అనవసరపు కొనుగోళ్లు వద్దని మరో ఐదుగురికి చెప్పాలని కోరారు. అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు వాడటం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తన కాన్వాయ్‌ను సగానికి తగ్గించుకోవాలని, హెలికాప్టర్ వాడకూడదని హిమాచల్ గవర్నర్ కవీందర్ గుప్తా నిర్ణయించారు. పొదుపు చర్యలు పాటించాలని ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కుకు లేఖ రాశారు. దీనిపై సుఖ్వీందర్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం ఇప్పటికే పొదుపు చర్యలు ప్రారంభించిందని, మంత్రుల వేతనాలు 30శాతం, ఎమ్మెల్యేల వేతనాలు 20శాతం తగ్గించామని ప్రకటించారు.
అత్యవసర సర్వీసులు మినహా గ్రూప్-సి, గ్రూప్-డి స్థాయి ఉద్యోగుల్లో 50శాతం మందికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. వారు డ్యూటీ సమయంలో విధిగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు కూడా ఇలా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించింది.
ఛత్తీస్‌గఢ్, ఒడిశా ముఖ్యమంత్రులు విష్ణుదేవ్ సాయ్, మోహన్ మాఝీ, మంత్రులు తమ కాన్వాయ్‌లను సగానికి తగ్గించుకున్నారు.