Share News

అనలాగ్‌ పనీర్‌ అమ్మకంపై కొరడా!

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:21 AM

మార్కెట్లో లభించే కృత్రిమ లేదా ప్రత్యామ్నాయ పనీర్‌ ఉత్పత్తుల తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

అనలాగ్‌ పనీర్‌ అమ్మకంపై కొరడా!
panneru

  • ‘పనీర్‌’ పేరుతో లేబులింగ్‌

మార్కెటింగ్‌ చేయొద్దని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: మార్కెట్లో లభించే కృత్రిమ లేదా ప్రత్యామ్నాయ పనీర్‌ ఉత్పత్తుల తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అనలాగ్‌ పనీర్‌’ను ఇకపై ‘పనీర్‌’ పేరుతో విక్రయించకూడదని ప్రతిపాదించింది. ఈ మేరకు ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలకు సవరణలు చేస్తూ ముసాయిదా నోటిపికేషన్‌ విడుదల చేసింది. దీనిపై సూచనలు, అభ్యంతరాలను 60 రోజుల్లోగా పంపాలని పేర్కొంది. ‘‘ఇప్పటికే ‘అనలాగ్‌ ఇన్‌ డెయిరీ కాంటెక్ట్స్‌’ క్యాటగిరీ కింద లైసెన్స్‌ లేదా రిజిస్ట్రేషన్‌ పొందిన ఉత్పత్తులు తమ పేరు, లేబులింగ్‌, మార్కెటింగ్‌లో ‘పనీర్‌’ అనే పదాన్ని వాడడాన్ని నిలిపివేయాలి’’ అని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. ‘పనీర్‌’ పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించకుండా నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అనలాగ్‌ పనీర్‌ అనేది చూసేందుకు అచ్చం అసలైన పనీర్‌ లానే కనిపిస్తుంది, అనిపిస్తుంది. అయితే దీన్ని సంప్రదాయ పనీర్‌లా పాలు, పాల ఉత్పత్తులతో కాకుండా వెజిటెబుల్‌ నూనెలు, పిండి పదార్థాలు, మొక్కల ప్రొటీన్లు, ఎమిల్సిఫయర్లు వంటి వాటిలో తయారు చేస్తారు. అనలాగ్‌ ఉత్పత్తులతో తయారు చేసిన వంటకాలను ‘పనీర్‌’ పేరుతో విక్రయించడం ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006 నిబంధనలను ఉల్లంఘించడమేనని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే స్పష్టం చేసింది.

Updated Date - Sep 26 , 2026 | 05:21 AM