పిల్లలకు ఉచితంగా మధుమేహ పరీక్షలు, చికిత్స
ABN , Publish Date - May 04 , 2026 | 03:48 AM
పిల్లల్లో మధుమేహానికి సంబంధించి పరీక్షలు, రోగ నిర్ధారణ, చికిత్స, దీర్ఘకాల నిర్వహణ విధానాలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం మార్గదర్శక పత్రాన్ని విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ, మే 3: పిల్లల్లో మధుమేహానికి సంబంధించి పరీక్షలు, రోగ నిర్ధారణ, చికిత్స, దీర్ఘకాల నిర్వహణ విధానాలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం మార్గదర్శక పత్రాన్ని విడుదల చేసింది. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించి జరిగిన ఓ జాతీయ సదస్సులో ‘పిల్లల్లో చక్కెర వ్యాధిపై మార్గదర్శక పత్రం’ను విడుదల చేశారు. పుట్టిన పిల్లల నుంచి నుంచి 18 ఏళ్ల వయసు లోపు వారిలో మధుమేహాన్ని ముందుగానే గుర్తించేందుకు కమ్యూనిటీ, స్కూల్ ఆధారిత వేదికల ద్వారా దేశవ్యాప్తంగా సార్వత్రిక స్ర్కీనింగ్‌ను నిర్వహించడమే ఈ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యమని ఆరోగ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అనుమానిత కేసులకు వెంటనే రక్తంలో గ్లూకోజ్ పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత నిర్ధారణ, చికిత్సలో కోసం జిల్లా స్థాయి ఆరోగ్య కేంద్రాలకు పంపనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో స్ర్కీనింగ్ నుంచి రోగ నిర్ధారణ సేవలు, జీవితకాల ఇన్సులిన్ చికిత్స, గ్లూకోమీటర్లు, టెస్టు స్ట్రిప్‌లు, ఆ తర్వాత క్రమం తప్పని ఆరోగ్య సంరక్షణను ఉచితంగా అందించడం ఈ కార్యక్రమంలో ఓ కీలకమైన విషయమని వెల్లడించింది.