కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:19 AM
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చాణక్యుడిగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్(71) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు..
కోల్‌కతా, ఫిబ్రవరి 23: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చాణక్యుడిగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్(71) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సాల్ట్‌లేక్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ముకుల్ రాయ్ తన 4దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ), బీజేపీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో మమతా బెనర్జీ కాంగ్రె్‌సను వీడి టీఎంసీని స్థాపించినప్పుడు ఆమెకు అండగా నిలిచారు. పార్టీలో రెండో శక్తిమంతమైన నేతగా ఎదిగారు. యూపీఏ-2 ప్రభుత్వంలో మొదట నౌకాయానశాఖ సహాయ మంత్రిగా, తర్వాత రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో టీఎంసీతో విభేదాలు రావడంతో బీజేపీలో చేరడం అప్పట్లో సంచలనంగా మారింది. 2021లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. కొద్దికాలానికే తిరిగి టీఎంసీలో చేరారు. అయితే, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు.