ఫారం-6లో మార్పులు చేయాలి
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:58 AM
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఓటరు జాబితా నుంచి తొలగింపునకు గురైన వారు.. తిరిగి ఓటరుగా దరఖాస్తు చేసుకునేందుకు ఫారమ్ 6లో మార్పులు చేయాలని మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
మొదటిసారి ఓటర్లమన్న ధ్రువీకరణ అక్కర్లేదు
గత ఎపిక్ నంబరు నమోదుకు అవకాశమివ్వాలి
అప్పుడే తొలగింపునకు గురైన వారు సులభంగా దరఖాస్తు చేసుకోగలరు
ఈసీకి మహారాష్ట్ర ఎన్నికల అధికారి ప్రతిపాదన
ముంబై, అక్టోబరు 18: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఓటరు జాబితా నుంచి తొలగింపునకు గురైన వారు.. తిరిగి ఓటరుగా దరఖాస్తు చేసుకునేందుకు ఫారమ్ 6లో మార్పులు చేయాలని మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సర్‌లో స్థానం కోల్పోయి తిరిగి ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ప్రస్తుతమున్న ఫారమ్ 6లో.. గత సర్ జాబితాలో తమకు సంబంధించి లేదా తమ తల్లిదండ్రులకు సంబంధించి వివరాలను ఇవ్వడం తప్పనిసరి. లేదంటే తాము మొదటిసారి ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నామని ధ్రువీకరణ ఇవ్వాలి. ఇలా చేయడం తప్పుడు ధ్రువీకరణ కిందకే వస్తుంది. ఇలా చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 31 కింద ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులు తొలగించేందుకు వీలుగా మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఫారమ్-6లో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి గత వారం ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘న్యూ ఓటర్’ కాలమ్ తొలగించాలని.. గతంలో ఏదేనీ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఓటరుగా నమోదు చేసుకుని, తొలగింపునకు గురైన వారు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ధ్రువీకరణకు అవకాశం కల్పించాలని కోరారు. తొలగింపునకు ముందున్న ఎలక్షన్ ఫొటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్) నంబర్‌ను నమోదు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఫారమ్-6లో మార్పు చేస్తే అప్పుడు అర్హత కలిగిన వారు సులభంగా తిరిగి నమోదు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.