తల్లి అంత్యక్రియల కోసం చిన్మయ్ కృష్ణదాస్‌కు కేవలం 5గంటల పెరోల్
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:43 AM
బంగ్లాదేశ్‌లో జైల్లో ఉన్న హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ తన తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి అధికారులు కేవలం 5గంటలు మాత్రమే పెరోల్ మంజూరు చేశారు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: బంగ్లాదేశ్‌లో జైల్లో ఉన్న హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ తన తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి అధికారులు కేవలం 5గంటలు మాత్రమే పెరోల్ మంజూరు చేశారు. ఈ నెల 10న కృష్ణదాస్ తల్లి సంధ్యారాణి(71) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అంతకుముందు తన తల్లిని చూడటానికి కృష్ణదాస్ ఎన్నోసార్లు అధికారులకు అర్జీ చేసుకున్నారు. కానీ, వారు అనుమతించలేదు. సంధ్యారాణి కూడా తాను చనిపోయేలోగా ఒక్కసారైనా కుమారుడు చిన్మయ్‌ను చూడాలని పరితపించారు. తన కోరిక తీరకుండానే చనిపోయారు. గురువారం సంధ్యారాణి అంత్యక్రియల అనంతరం పోలీసులు కృష్ణదా్‌సను వెంటనే జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన.. తల్లిని బతికి ఉండగా చూడలేకపోయానంటూ విలపిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా, దేశద్రోహం ఆరోపణలతో కృష్ణదాస్ 2024నవంబరులో జైలు పాలయ్యారు.