Share News

చుక్కలంటిన విమాన టికెట్ల ధరలు

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:53 AM

యుద్ధ మేఘాలు గల్ఫ్‌ ప్రాంతాన్ని కమ్మేసిన తర్వాత విమానయాన రంగం స్తంభించింది. వేలాది విమానాల రద్దుతో లక్షలాది మంది ఆయా దేశాల్లో చిక్కుకుపోయారు....

చుక్కలంటిన విమాన టికెట్ల ధరలు

  • దుబాయి నుంచి ముంబైకి రూ.20 వేల టికెట్‌ 65వేలకు

న్యూఢిల్లీ, మార్చి 9: యుద్ధ మేఘాలు గల్ఫ్‌ ప్రాంతాన్ని కమ్మేసిన తర్వాత విమానయాన రంగం స్తంభించింది. వేలాది విమానాల రద్దుతో లక్షలాది మంది ఆయా దేశాల్లో చిక్కుకుపోయారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఆదివారం (మార్చి 8) వరకూ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 2,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. యుద్ధం తీవ్రం అవుతున్న నేపథ్యంలో అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలను నిరవధికంగా మూసేస్తున్నట్లు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచి బయటపడితే చాలనుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ప్రైవేటు విమానాల కోసం డిమాండ్‌ అమాంతం పెరిగిపోయింది. అడపాదడపా నడుస్తున్న విమానాల ధరలకూ రెక్కలు వచ్చాయి. విమాన బీమా ధరలు భారీగా పెరగడం, సర్వీసులు పరిమితంగా ఉండడం దీనికి ప్రధాన కారణంగా చెపుతున్నారు. దుబాయి నుంచి ముంబైకి ఎయిర్‌ ఇండియా, ఇండిగో నాన్‌ స్టాప్‌ విమానాల ఎకానమీ తరగతికి టికెట్‌ ధర రూ.20 వేలు వరకూ ఉండేది. మార్చి 10న ప్రయాణానికి ఆ ధర రూ.45,000 నుంచి రూ.65,000 వరకూ ఉంది. అలాగే గల్ఫ్‌ నుంచి ఇండియాకు రావడానికి 7-8 సీట్లు ఉండే ప్రైవేటు జెట్‌ విమానాల ధర రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పలుకుతోంది. డిమాండ్‌ విపరీతంగా ఉండడంతో దొరికిన ప్రతి విమానాన్ని ప్రైవేటు ఆపరేటర్లు తీసుకుంటున్నారు. హాకర్‌ 800, లీయర్‌ జెట్‌, సైటేషన్‌ సీజే వంటి ఏడెనిమిది సీట్లు ఉండే విలాసవంతమైన విమానాలనే కాకుండా 180 మంది ప్రయాణికులను తీసుకొని వెళ్లే ఎయిర్‌బస్‌ ఏ320, బోయింగ్‌ బీ737 వాణిజ్య విమానాలనూ నిర్వాహకులు రంగంలోకి దించుతున్నారు. ఫ్లైయింగ్‌ బర్డ్స్‌ ఏవియేషన్‌ సీఈఓ ఆషిశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘మా వద్ద మూడు పెద్ద ప్రైవేటు విమానాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. అనుమతులు లేక, గగనతలం మూసివేతతోనూ మేం కదలలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధం ఆరంభంలో డిమాండ్‌ అత్యధికంగా యూఏఈ నుంచి ఉంది. ఇప్పుడు బహ్రెయిన్‌లో బాంబుల మోత పెరగడంతో అక్కడ నుంచి డిమాండ్‌ పెరిగింది. దాని తరువాతి స్థానాల్లో కువైత్‌, సౌదీ అరేబియాలున్నాయి. అయితే ప్రస్తుతం కువైత్‌, బహ్రెయిన్‌ గగనతలాన్ని పూర్తిగా మూసేశారు. అందుకనే మేం ప్రయాణికులను దగ్గరలోని విమానాశ్రయాలకు లేదా పొరుగు దేశాలకు రోడ్డు మార్గంలో రావాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. ఎయిర్‌ ఇండియా బుకింగ్స్‌కూ అమాంతం డిమాండ్‌ పెరిగింది. మార్చి 11-15 మధ్య దుబాయి-ముంబై మధ్య ప్రయాణించే విమానాల టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి ఎయిర్‌ ఇండియా మార్చి 9 నుంచి జెడ్డా, మస్కట్‌ల నుంచి దేశంలోని పలు నగరాలకు తన విమానాలను నడుపుతోంది.


ఏడాదికి 9.2కోట్ల మంది ప్రయాణం

ఇరాన్‌ క్షిపణి దాడులు గల్ఫ్‌ ప్రాంతాన్ని తాకిన తర్వాత.. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యంత బిజీగా ఉండే దుబాయ్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ప్రతి 72 సెకన్లకో విమానం టేకాఫ్‌ లేదా ల్యాండిండ్‌ అవుతుంది. ఏడాదికి సుమారు 9.2 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారు. యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌ విమానాశ్రయంలో ఫిబ్రవరి 28న మొదటిసారి విమాన సర్వీసులను నిలిపివేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే దోహా, అబుధాబీ సహా ప్రధాన గల్ఫ్‌ విమానయాన కేంద్రాలు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయి. తర్వాత మూడు రోజుల్లో 12 వేల మేర విమాన సర్వీసులను రద్దు చేశారు. బయలుదేరాల్సిన షెడ్యూల్‌ విమానాల్లో ఇవి దాదాపు 40 శాతం ఉంటాయి. ఫలితంగా 10 లక్షల మందికి పైగా ప్రయాణికులపై ప్రభావం పడింది.

Updated Date - Mar 10 , 2026 | 04:53 AM