అంకెలు సరిగా రాయలేదని కూతుర్ని నేలకేసి కొట్టి చంపాడు!
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:53 AM
నాలుగున్నరేళ్ల పాప.. ఒకటి నుంచి 50 వరకు అంకెలు సరిగా రాయలేదన్నకోపంతో ఆమెను కన్నతండ్రి అప్పడాల కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.
యూపీలోని ఫరీదాబాద్‌లో తండ్రి దుర్మార్గం
లఖ్‌నవూ, జనవరి 24: నాలుగున్నరేళ్ల పాప.. ఒకటి నుంచి 50 వరకు అంకెలు సరిగా రాయలేదన్నకోపంతో ఆమెను కన్నతండ్రి అప్పడాల కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అప్పటికీ ఆగ్రహం చల్లారక ఆ చిన్నారిని విసురుగా నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో పాప తలకు తీవ్రగాయాలయ్యాయి. తర్వాతే తానే ఆ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచింది. యూపీలోని ఫరీదాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసిందీ ఘోరం. చిన్నారికి గాయాలెందుకయ్యాయి? అని వైద్యులు అడిగితే మెట్ల మీద నుంచి జారి పడిందని కట్టుకథ అల్లాడు ఆ తండ్రి. తన భార్య రంజితకు కూడా అలాగే చెప్పాడు. హతురాలు వంశిక. నిందితుడు కృష్ణా జైస్వాల్(31). అయితే ఈ దంపతులకు వంశికతో పాటు మరో ఇద్దరు పిల్లలున్నారు. ఘటన జరిగినప్పుడు ఆ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. వారిలో ఏడేళ్ల బాలుడు.. చెల్లి వంశిక పట్ల తండ్రి ప్రదర్శించిన దాష్టీకాన్ని తల్లి రంజితకు కళ్లకు కట్టినట్టు వివరించాడు. దీంతో ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు.