2027 మార్చికల్లా హైవేలపై టోల్ బ్యారియర్లు లేని ప్రయాణం
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:53 AM
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ బ్యారియర్లు (అడ్డంకులు) లేని ప్రయాణం అందుబాటులోకి రానుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఫాస్టాగ్‌తో ఏటా 25 వేల కోట్ల అదనపు లబ్ధి: గడ్కరీ
ముంబై, సెప్టెంబరు 11: వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ బ్యారియర్లు (అడ్డంకులు) లేని ప్రయాణం అందుబాటులోకి రానుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ ఫాస్టాగ్ పూర్తి స్థాయి అమలుతో ఏటా రూ.25 వేల కోట్ల అదనపు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. శుక్రవారం ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ సదస్సులో గడ్కరీ మాట్లాడారు. ఫాస్టాగ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కేవలం తమ శాఖ ద్వారానే భారత ప్రభుత్వానికి ఏటా రూ.20 వేల కోట్ల నుంచి 25 వేల కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఫాస్టాగ్ విధానం తేవడం వల్ల ఇప్పటికే టోల్ బూత్‌ల ఆదాయం 10ు(దాదాపు రూ.7 వేల కోట్లు) పెరిగి.. రూ.82 వేల కోట్లకు చేరిందన్నారు. 2027 మార్చి నాటికి హైవేలపై ఉన్న టోల్ బూత్‌లన్నీ బ్యారియర్ ఫ్రీగా (వాహనాలు ఆపకుండానే టోల్ చెల్లించే వ్యవస్థ) మారనున్నాయని వివరించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 70ు టోల్‌గేట్లలో ఈ విధానం అమలులోకి రానుందన్నారు. ఈ విధానంతో టోల్ బూత్ నిర్వహణ వ్యయం ప్రస్తుతమున్న 12-15 శాతం ఉంచి 2-3 శాతానికి తగ్గుతుందని చెప్పారు. అలాగే టోల్‌గేట్ల వద్ద వాహనదారులు వేచి చూడాల్సిన అవసరం ఉండదని.. దీంతో వాహనదారుల విలువైన సమయం ఆదా అవుతుందని వెల్లడించారు. ఇలా వేచి ఉండే సమయం తగ్గడం వల్ల ఏడాదికి సుమారు రూ.5,250 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలోనే కొత్త బ్యాంకు ఖాతా తీసుకున్నా పాత ఫాస్టాగ్‌నే వాడుకునేలా వన్ ట్యాగ్ సదుపాయాన్ని గడ్కరీ ప్రారంభించారు.