ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ.75 పెంపు
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:40 AM
దేశంలోని జాతీయ రహదారులపై వాహనదారులు అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు వీలుగా తీసుకొచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను జాతీయ రహదారుల ...
న్యూఢిల్లీ, హైదరాబాద్, మార్చి 15: దేశంలోని జాతీయ రహదారులపై వాహనదారులు అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు వీలుగా తీసుకొచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.75 పెంచింది. ప్రస్తుతం ఈ పాస్ ధర రూ.3వేలు ఉండగా.. వచ్చే ఏప్రిల్ 1 నుంచి దీన్ని రూ.3,075కు పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఈ పెంపు 2026-27 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 1,150 జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద చెల్లుబాటయ్యేలా గతేడాది ఆగస్టు 15న వార్షిక పాస్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పాస్ తీసుకుంటే ఏడాదిపాటు లేదా రెండు వందలసార్లు (ఏది ముందైతే అది) టోల్‌ప్లాజాలు దాటే అవకాశం ఉంటుంది. చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ కలిగిన అన్ని నాన్ కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ గణాంకాల ప్రకారం వార్షిక పాస్ తీసుకున్న వినియోగదారుల సంఖ్య 56 లక్షలు దాటింది.