కుటుంబం అగ్నికి ఆహుతి..!
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:05 AM
కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోరం జరిగింది. సురపుర తాలూకా శాంతపుర సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో..
టైరు పేలి బస్సును ఢీకొన్న కారు
ఎనిమిది మంది సజీవ దహనం..
ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు
మృత్యువుతో పోరాడుతున్న పదేళ్ల చిన్నారి
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో దుర్ఘటన
బళ్లారి/బళ్లారి గాంధీనగర్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోరం జరిగింది. సురపుర తాలూకా శాంతపుర సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. వీరంతా దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న బస్సును ఢొకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు, బస్సు పూర్తిగా కాలిపోయాయి. ఆ సమయంలో కారులో పది మంది ఉండగా.. 8 మంది సజీవ దహనమయ్యారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మృతులను రాయచూరు జిల్లా శిరవర గ్రామానికి చెందిన కృష్ణా నాయక్ (52), ఆయన భార్య అనంత కళ (42), సోదరుడు శరణప్ప (36), ఆయన భార్య నిసర్గ (30), వీరి కుమారుడు సిద్ధార్థ (3), కుమార్తె శ్రీనిధి (1), శశికళ (30), ఆమె భర్త రాఘవేంద్ర (42), వీరి కుమార్తె చందన (8)గా గుర్తించారు. శశికళ, రాఘవేంద్ర దంపతుల కుమారుడు పదేళ్ల విరాట్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులంతా దిగిపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది.

అమావాస్య చీకట్లు..
యాదగిరి జిల్లా ఎస్పీ పృథ్వీ శంకర్ తెలిపిన వివరాల మేరకు... రాయచూరు జిల్లా శిరవార పట్టణ పంచాయతీ సభ్యుడు కృష్ణానాయక్ అమావాస్య రోజున దేవుణ్ని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భావించి.. గురువారం రాత్రి కుటుంబంతో కలిసి యాదగిరి జిల్లా సురపురలోని వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లారు. రాత్రి దైవసన్నిధిలో నిద్రించి, శుక్రవారం ఉదయాన్నే నదీస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వస్థలానికి బయల్దేరారు. శాంతపుర క్రాస్ వద్దకు రాగానే జాతీయ రహదారి 151ఏపై వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. దీంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును వేగంగా వెళ్లి ఢీకొట్టింది. వెంటనే బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు కిందకు దిగేశారు. కారులో ఉన్నవారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు, బస్సు రెండూ మంటల్లో చిక్కుకున్నాయి. కారులో ఉన్న ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. రాఘవేంద్ర, ఆయన కుమారుడు విరాట్‌ను బయటకు లాగి.. ఆస్పత్రికి తరలిస్తుండగా రాఘవేంద్ర మృతిచెందారు. చిన్నారి విరాట్ యాదగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.