Amardeep Kumar Arrested: ఫాల్కన్ గ్రూపు ఎండీ అమర్‌దీప్ కుమార్ అరెస్టు
ABN , Publish Date - Jan 07 , 2026 | 04:15 AM
రూ.792 కోట్ల ఫాల్కన్ ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్ స్కామ్ కేసుకు సంబంధించి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ అమర్‌దీప్ కుమార్‌ను సీఐడీ అధికారులు ముంబై విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
రూ.792 కోట్ల స్కామ్‌లో నిందితుడు
విదేశాలకు సొంత జెట్‌లో పరారీ
సీఐడీ లుక్ అవుట్ నోటీసు జారీ
ముంబైలో అమర్‌దీప్ పట్టివేత
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రూ.792 కోట్ల ఫాల్కన్ ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్ స్కామ్ కేసుకు సంబంధించి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ అమర్‌దీప్ కుమార్‌ను సీఐడీ అధికారులు ముంబై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్ పథకం అంటూ 7,056 మంది నుంచి అమర్‌దీప్ కుమార్, అతని ముఠా కలిసి రూ.4,215 కోట్లు వసూలు చేశారు. వీరి కార్యక్రమాలపై ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేయడంతో కొంతమందికి చెల్లింపులు చేశారు. చివరకు 4,065 మంది ఖాతాదారులకు రూ.792కోట్లు బకాయిలు పడటంతో వివిధ పోలీసు స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయి. అమర్‌దీప్ కుమార్ తదితరులు తమ సొంత జెట్ విమానంలో విదేశాలకు పారిపోయారు. ఆపై సీఐడీలోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ దర్యాప్తు చేపట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసింది. అమర్‌దీప్ కోసం సీఐడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇరాన్ నుంచి ముంచై చేరుకున్న అమర్‌దీప్ కుమార్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి సీఐడీకి సోమవారం రాత్రి సమాచారం ఇచ్చారు. దీంతో సీఐడీ బృందాలు ముంబై వెళ్లి అమర్‌దీ్‌పను కస్టడీలోకి తీసుకుని వచ్చి మంగళవారం కోర్టులో హజరుపరిచారు. ఖాతాదారుల నుంచి సేకరించిన డబ్బును సొంత ఆస్తుల కొనుగోలుకు ఫాల్కన్ గ్రూపు వెచ్చించిందని, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 12 ప్లాట్లు, నాలుగు లగ్జరీ కార్లు, రూ.8 లక్షల నగదు, 21 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 కోట్ల విలువైన షేర్లు, బ్యాంకుల్లో ఉన్న రూ.8 కోట్ల నగదును మొత్తం రూ 43 కోట్లు సీజ్ చేశామని సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా తెలిపారు. ఇటీవలే అమర్‌దీప్ కుమార్‌కు చెందిన జెట్ విమానాన్ని ఈడీ అధకారులు సీజ్ చేసి వేలానికి సైతం పెట్టిన సంగతి తెలిసిందే.