Share News

బోగస్‌ ఫారం-7 దరఖాస్తులపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Oct 31 , 2026 | 03:20 AM

సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించడానికి ఉద్దేశించిన ఫారం-7ను దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున నకిలీ దరఖాస్తులను సమర్పిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

బోగస్‌ ఫారం-7 దరఖాస్తులపై చర్యలు తీసుకోండి

  • ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

  • యూపీలో ముస్లిం ఓటర్ల తొలగింపునకు ఓ బీజేపీ నేత ఏకంగా 32 ఫారం-7 పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు

న్యూఢిల్లీ, అక్టోబరు 30: సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించడానికి ఉద్దేశించిన ఫారం-7ను దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున నకిలీ దరఖాస్తులను సమర్పిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున బోగస్‌ ఫారం-7 దరఖాస్తులు సమర్పిస్తున్నారంటూ.. సర్‌ ప్రక్రియను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ తనూజ్‌ పునియా, సమాజ్‌వాదీ పార్టీ నేత అరవింద్‌ కుమార్‌ తదితరులు వేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బాగ్చి, జస్టిస్‌ మోహనల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు దాఖలైనట్లు గుర్తించామని.. వాటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి నకిలీవని తేల్చారని వెల్లడించారు. అయితే వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అయితే ఒక నియోజకవర్గంలో ముస్లిం వర్గానికి చెందిన ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా ఓ బీజేపీ నేత ఏకంగా 32 ఫారం-7 పత్రాలు సమర్పించారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందులో 2 ఫారాలపై బీఎల్‌వోల సంతకాలు కూడా ఉన్నాయని తెలిపారు. యూపీలో సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్లే తెలంగాణ, కర్ణాటకల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు.


ఢిల్లీలో 47.56 లక్షల ఓటర్ల ఇంటింటి సర్వే..

ఢిల్లీలో తొలగించిన 47.56లక్షల ఓటర్ల అర్హతను పునఃపరిశీలించేందుకు ఇంటింటి సర్వేను ముమ్మరం చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సర్‌ ప్రక్రియ గడువును నవంబరు 25వరకు పొడిగిస్తున్నట్లు ఈసీ ప్రకటించిన ఒకరోజు తర్వాత వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబరు 15, 22వ తేదీల్లో విద్యార్థులు, నిరాశ్రయులు, ట్రాన్స్‌జెండర్లు, సెక్స్‌ వర్కర్ల కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

Updated Date - Oct 31 , 2026 | 03:22 AM