Employment Guarantee: ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:40 AM
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్‌జీ చట్టం గ్రామీణ పేదలపై, వ్యవసాయ కార్మికులపై, నిరుద్యోగ యువత....
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
న్యూఢిల్లీ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్‌జీ చట్టం గ్రామీణ పేదలపై, వ్యవసాయ కార్మికులపై, నిరుద్యోగ యువత, మహిళలపై కేంద్రం ప్రకటించిన బహిరంగ యుద్థమని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005 ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రజలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న చట్టబద్థమైన పని హక్కును కేంద్రం లాక్కుంటోందని, కార్పొరేట్ లాభాల కోసం పేదల బతుకులను బలిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాలు, రేగ సంఘర్ష మోర్చ్ అధ్వర్యంలో సుర్జిత్ భవన్‌లో గురువారం అఖిల భారత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతి ఘోష్, ప్రొఫెసర్ అర్చన ప్రసాద్, సీఐటీయూ అధ్యక్షుడు సుదీప్ దత్తా, ఐఎన్‌టీయూసీ నేత రఫియా, సీపీఎం నేత బి.వెంకట్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల తీసుకొచ్చిన వీబీ జీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ‘‘2005 చట్టం గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పిేస్త, 2025 చట్టం ఆ భద్రతను కూల్చివేసి దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేలా ఉంది’’ అని విమర్శించారు. గ్రామీణ పేదల పని హక్కును కాలరాస్తే దేశవ్యాప్త ఉద్యమంతో తగిన బుద్ధి చెబుతామని సమావేశంలో వక్తలు హెచ్చరించారు.