Share News

ఓటు పోయింది.. పాస్‌పోర్టు ఆగింది

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:25 AM

ఈ ఏడాది మార్చిలో పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో తన ఓటు తొలగించారని..

ఓటు పోయింది.. పాస్‌పోర్టు ఆగింది

  • సర్‌ ప్రక్రియలో భాగంగా తన ఓటు తొలగించడంపై ‘ద టెలిగ్రాఫ్‌’ మాజీ ఎడిటర్‌ రాజ్‌గోపాల్‌ ఆవేదన

న్యూఢిల్లీ, జూన్‌ 29: ఈ ఏడాది మార్చిలో పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో తన ఓటు తొలగించారని.. ‘ద టెలిగ్రాఫ్‌’ మాజీ సంపాదకుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2002 ఓటరు జాబితాలో తన పేరు, తన తండ్రి పేరు కూడా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ గాంధేయవాది, విశ్రాంత ప్రొఫెసర్‌, కేరళలో ‘గాంధీ స్మారక నిధి’ మాజీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా వ్యవహరించిన తన తండ్రి పేరును 2002 జాబితా నుంచి ఎలా తొలగించారో కూడా తనకు అర్థం కావట్లేదని ఆయన వాపోయారు. ఓటరు జాబితాలో తన పేరు లేదనే కారణంతో.. తన పాస్‌పోర్టు పునరుద్ధరణ కూడా నిలిచిపోయిందని తెలిపారు. తాను పాస్‌పోర్టు రెన్యువల్‌ కోసం దరఖాస్తు సమర్పించి జూన్‌ 27కి 100 రోజులు గడిచిపోయాయని.. ఇతర పత్రాలు ఎన్ని సమర్పించినప్పటికీ పోలీసు వెరిఫికేషన్‌ పూర్తికాలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 17న తన కుమార్తె వివాహం కాలిఫోర్నియాలో జరిగిందని.. పదేళ్ల అమెరికా వీసా ఉన్నప్పటికీ పాస్‌పోర్టు రెన్యువల్‌ కాకపోవడం వల్ల తాను తన కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయానని ఆవేదన వెలిబుచ్చారు. ఓటరు జాబితా నుంచి రాజ్‌గోపాల్‌ పేరును తొలగించడాన్ని.. ఆయన పాస్‌పోర్టు పునరుద్ధరణను నిలిపివేయడాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండించింది. కాగా.. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని రాజ్‌గోపాల్‌ పాస్‌పోర్టును పునరుద్ధరించాలని కోరుతూ కేరళ సీఎం సతీశన్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారికి లేఖ రాశారు.

Updated Date - Jun 30 , 2026 | 04:25 AM