ఎవరెస్ట్‌పై ప్రాణాల మీదకు తెచ్చి.. భయపెట్టి..!
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:09 AM
ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరంపై పర్వతారోహకుల ప్రాణాన్ని షెర్పాలు (స్థానిక ట్రెక్కింగ్ నిపుణులు) పణంగా పెడుతున్నారు. తినే ఆహారాన్ని గుట్టుగా విషపూరితం చేసి..
పర్వతారోహకుల ప్రాణాలతో షెర్పాల చెలగాటం
వెలుగులోకి రూ.186 కోట్ల బీమా స్కాం
ఖాఠ్మాండు, ఏప్రిల్ 2: ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరంపై పర్వతారోహకుల ప్రాణాన్ని షెర్పాలు (స్థానిక ట్రెక్కింగ్ నిపుణులు) పణంగా పెడుతున్నారు. తినే ఆహారాన్ని గుట్టుగా విషపూరితం చేసి.. బీమా సొమ్ము కోసం దురాగతాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవస్థీకృత మోసానికి సంబంధించి షెర్పాలు, ట్రెక్కింగ్ ఏజెన్సీల యజమానులు, హెలికాప్టర్ ఆపరేటర్లు, ఆస్పత్రుల ఎగ్జిక్యూటివ్‌లు సహా 32 మందిపై నేపాల్ పోలీసులు అభియోగాలు మోపారు. ఎవరెస్ట్‌పై పర్వతారోహకులే టార్గెట్‌గా సాగిన రూ.186 కోట్ల బీమా స్కాం తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్రెక్కింగ్ ఏజెన్సీల కింద పనిచేసే షెర్పాలు పర్వతారోహణ సమయంలో పర్యాటకులకు తెలియకుండా వారి భోజనంలో బేకింగ్ సోడా వంటి పదార్థాలు అధికంగా కలిపి వారిని తీవ్ర అస్వస్థతకు గురయ్యేలా చేసేవారు. అనంతరం వారిని భయపెట్టి ఖరీదైన హెలికాప్టర్ సేవలకు ఒప్పించి.. వారిని అందులో తమకు తెలిసిన ఆస్పత్రులకు తరలించేవారు. ఆస్పత్రుల్లోనూ నకిలీ బిల్లులు వేసేవారు. చివరికి వైద్య బీమా, అంతర్జాతీయ ప్రయాణ బీమా సంస్థల నుంచి సొమ్మును క్లెయిమ్ చేసుకునే వారు. అనంతరం షెర్పాలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, ఆస్పత్రుల నిర్వాహకులు ఆ సొమ్మును పంచుకునేవారు. ఇలా మొత్తం 20మిలియన్ డాలర్ల మేర (సుమారు రూ.186 కోట్లు) పలు బీమా సంస్థల నుంచి వసూలు చేశారని పోలీసులు తెలిపారు. పర్వతాల్లో సహాయక చర్యలు చేపట్టే 3 సంస్థలకు చెందిన ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లను ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేయగా.. ఈ స్కాం డొంక కదిలింది. ఇప్పటివరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు.