వంటగ్యాస్ ధరలకు ‘ఇథనాల్’తో చెక్!
ABN , Publish Date - May 30 , 2026 | 03:16 AM
సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్న వంటగ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా కేంద్రప్రభుత్వం సరికొత్త ఇంధన సాంకేతికతను తెరపైకి తెచ్చింది.
ఎల్పీజీ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా దేశీయ స్టవ్ సాంకేతికత.. ఆవిష్కరించిన నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, మే 29: సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్న వంటగ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా కేంద్రప్రభుత్వం సరికొత్త ఇంధన సాంకేతికతను తెరపైకి తెచ్చింది. దేశీయ బయో ఫ్యుయెల్ (జీవ ఇంధన) రంగాన్ని బలోపేతం చేస్తూ.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇథనాల్ ఆధారిత స్టవ్ సాంకేతికతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల నాగ్‌పూర్‌లో ఆవిష్కరించారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్ కంటే తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా వంట చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 7 శాతం ఇథనాల్, 93 శాతం నీటి మిశ్రమాన్ని ఇంధనంగా వాడుకుని ఈ స్టవ్‌లు సురక్షితంగా మంటను ఉత్పత్తి చేస్తాయని అన్నారు. భారత్ తన చమురు అవసరాల కోసం ఏకంగా 87 శాతం ముడిచమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని, ఇలాంటి స్వదేశీ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థికభారాన్ని తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.