Share News

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో వివరాలు!

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:17 AM

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) చందాదారులు తమ బ్యాలెన్స్‌ చూసుకోవాలంటే పోర్టల్‌లో లాగిన్‌ కావాల్సిన అవసరం లేదు. ఇకపై వాట్సాప్‌ ద్వారా ఫోన్‌లోనే బ్యాలెన్స్‌, పాస్‌బుక్‌ వివరాలను తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో వివరాలు!

  • బ్యాలెన్స్‌, పాస్‌బుక్‌ సమాచారం ఇక ఫోన్లోనే

న్యూఢిల్లీ, నవంబరు 1: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) చందాదారులు తమ బ్యాలెన్స్‌ చూసుకోవాలంటే పోర్టల్‌లో లాగిన్‌ కావాల్సిన అవసరం లేదు. ఇకపై వాట్సాప్‌ ద్వారా ఫోన్‌లోనే బ్యాలెన్స్‌, పాస్‌బుక్‌ వివరాలను తెలుసుకోవచ్చు. ఉద్యోగులు సాధారణ పీఎఫ్‌ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గించే లక్ష్యంతో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఆదివారం ఈ సేవలను ప్రారంభించారు. ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరో కీలక నిర్ణయాన్నీ ప్రకటించారు. వెయ్యి రూపాయలు లేదా అంతకంటే తక్కువ నిల్వ ఉన్న అర్హత కలిగిన క్రియారహిత పీఎఫ్‌ ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్‌ చేయనున్నారు. ఈపీఎ్‌ఫవో ధ్రువీకరించిన వాట్సాప్‌ సేవ ద్వారా సభ్యులు తమ పీఎఫ్‌ ఖాతాలోని మొత్తం నిల్వ, ఇటీవల జరిగిన ఐదు లావాదేవీలు, పీఎఫ్‌ పాస్‌బుక్‌ సమాచారం తెలుసుకోవచ్చు. ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన (పీఎంవీబీఆర్‌వై)కు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేయడంలోనూ సహాయం పొందవచ్చు. మరోవైపు పీఎఫ్‌ ఖాతాల్లో చిన్న మొత్తాలు ఉండిపోయి, క్రియారహితంగా మారిన ఖాతాదారులకు కూడా ఈపీఎఫ్‌వో ఊరటనిచ్చింది. ఆధార్‌ ధ్రువీకరణ పూర్తయి, వెయ్యి రూపాయలు లేదా అంతకంటే తక్కువ నిల్వ ఉన్న క్రియారహిత ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్‌ చేయనున్నారు.


ఇందు కోసం ఖాతాదారులు వ్యక్తిగతంగా క్లెయిమ్‌ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. నిర్దేశిత గుర్తింపు, బ్యాంకు ఖాతా ధ్రువీకరణ అనంతరం ఈపీఎఫ్‌వో స్వయంగా సెటిల్‌మెంట్‌ ప్రక్రియను చేపడుతుంది. ఈ ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌ విధానం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు లక్ష ఖాతాలకు ప్రయోజనం కలగనుంది. ఆయా ఖాతాల్లో దాదాపు రూ.5 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈపీఎఫ్‌వో 74 ఏళ్ల ప్రస్థానంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర మంత్రి మాండవీయ పేర్కొన్నారు. సంస్థలో 8 కోట్ల మందికి పైగా సభ్యుల భాగస్వామ్యంతో రూ.32లక్షల కోట్ల నిధి సమకూరిందన్నారు. చందాదారుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను వినియోగించుకోవాలని, సేవల్లో మరిన్ని మార్పులు తీసుకురావాలని అధికారులకు సూచించారు.

Updated Date - Nov 02 , 2026 | 02:18 AM