కమల బంధంలో అంబానీ!
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:05 AM
‘స్టార్ లింక్’ వ్యవహారంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మాటల దాడి పెంచారు. బీజేపీకి రాజకీయంగా ప్రచారం చేసి పెట్టడానికి అంబానీ రూ.కోట్లు వెచ్చిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీకి ప్రచారం చేసే సంస్థకు భారీ నిధులు
విరాళాల సేకరణలో రిలయన్స్‌కు చెందిన ఓ కంపెనీ
రూ.385 కోట్లు ఇచ్చిన అంబానీ
‘స్టార్ లింక్’ వ్యవహారంలో రిలయన్స్‌పై మస్క్ అక్కసు
పత్రికలు, చానళ్ల కథనాల స్క్రీన్ షాట్లతో పోస్టులు
తిప్పికొట్టిన భారత్
నిష్పక్షపాతంగానే నిబంధనలు
టెలికం మంత్రి జ్యోతిరాదిత్య
న్యూఢిల్లీ, అక్టోబరు 10 : ‘స్టార్ లింక్’ వ్యవహారంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మాటల దాడి పెంచారు. బీజేపీకి రాజకీయంగా ప్రచారం చేసి పెట్టడానికి అంబానీ రూ.కోట్లు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి సోషల్ మీడియాలో ప్రచారం చేసిపెడుతున్న ఓ సంస్థకు ముకేశ్ అంబానీ భారీగా నిధులు అందిస్తున్నారంటూ పత్రికలు, చానళ్లలో వచ్చిన కొన్ని కథనాల స్ర్కీన్‌షాట్లను మస్క్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రిలయన్స్‌తో సంబంధం ఉన్న ఓ కంపెనీ బీజేపీ రాజకీయ అవసరాల కోసం పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తోందని మస్క్ ఆరోపించారు. ‘ఫేస్‌బుక్‌లో బీజేపీకి ఆదరణ కోసం పనిచేస్తున్న కంపెనీకి రిలయన్స్ దన్నుగా ఎందుకుంది?’ అంటూ 2022లో ‘అల్ జజీరా’ ఒక కథనం ప్రసారం చేసింది. రిలయన్స్ బీజేపీకి రూ. 385 కోట్లు, శివసేనకు రూ.25 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా సమకూర్చిందంటూ 2024లో ‘ఇండియన్ ఎక్స్‌ప్రె్‌స’లో ఒక కథనం వచ్చింది. ఈ రెండింటినీ షేర్ చేస్తూ, ముకేశ్ అంబానీపై ఎలాన్ మస్క్ తన అక్కసును వెళ్లగక్కారు. కొన్నిరోజులుగా అంబానీ లక్ష్యంగా మస్క్ విమర్శల దాడి సాగిస్తున్నారు. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ..’ అంటూ శుక్రవారం సంచలన వ్యాఖ్యతో మస్క్ పోస్టు పెట్టారు. ఉపగ్రహ ఇంటర్నెట్ రంగంపై తన గుత్తాధిపత్యం నిలుపుకొనేందుకు ముకేశ్ అంబానీ ప్రయత్నిస్తున్నారని ఆ పోస్టులో ఆరోపించారు. ‘‘భారత్‌లో స్టాక్ లింక్ ప్రవేశానికి వ్యతిరేకంగా శక్తివంతమైన ఆర్థిక ప్రయోజనాలు పనిచేస్తున్నాయి.
ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన సంపన్న వర్గాలు మా రాకను ఇష్టపడటం లేదు.’’ అని విమర్శించారు. ‘‘నన్ను క్షమించండి అంబానీ గారు! భారత్‌కు మీరే నిజమైన బాస్ అని గ్రహించలేకపోయాను. భారత పౌరులను దోచుకునే అవకాశం వదులుకోవాలని మీరు అనుకోరు. అలాంటప్పుడు స్టార్ లింక్‌ను ఎలా అనుమతిస్తారు?’’ అంటూ వ్యాఖ్యానించారు.
మేం స్వతంత్రులం: జ్యోతిరాదిత్య
మస్క్ వరుస విమర్శలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. టెలికాం, ఉపగ్రహ సేవలకు సంబంధించిన నిబంధనలు నిష్పక్షపాతంగా, పక్కాగా రూపొందాయని వివరించింది. ఎంపిక పద్ధతిని అనుసరిస్తున్నామనేది అపోహ మాత్రమేనని తేల్చింది. ఎలాన్ మస్క్ ‘స్టార్ లింక్’, రిలయన్స్ ‘జియో’, భారతి ‘వన్ వెబ్’... దేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ లైసెన్స్ పొందాయని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరించారు. మరో సంస్థ అమెజాన్ ఆసక్తి వ్యక్తీకరణను ప్రకటించిందని తెలిపారు. రెవెన్యూ ఆధారంగా చార్జీలను నిర్ణయించి తర్వాత, స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తామని తెలిపారు. రక్షణ షరతులను అంగీకరించే దాన్నిబట్టి వాటికి అనుమతులు లభిస్తాయన్నారు. ఏ రంగంలోనూ గుత్తాధిపత్యం భారత్ అంగీకరించబోదని తేల్చిచెప్పారు. తమకు వినియోగదారుల సౌకర్యమే ముఖ్యమన్నారు. ‘‘సాంకేతికత విషయంలో మేం స్వతంత్రులం. మా వినియోగదారులకు ప్రతి సేవనూ అందుబాటులో ఉంచుతాం. అన్ని కంపెనీల సర్వీసులు వారికి అందించడం లక్ష్యంగా మేం పనిచేస్తాం. అందులో ఏ సర్వీసు ను మార్కెట్‌నుంచి పొందాలో వినియోగదారే నిర్ణయించుకుంటారు’’ అని సింధియా వివరించారు.