ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:21 AM
తమ కూటమి నుంచి వెళ్లిన పార్టీల దయతోనే టీవీకే ప్రభుత్వం కొనసాగుతోందని, అందుకే ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, ఆరు నెలల్లో...
ఆర్నెల్లలో వచ్చినా ఆశ్చర్యం లేదు
పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
చెన్నై, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): తమ కూటమి నుంచి వెళ్లిన పార్టీల దయతోనే టీవీకే ప్రభుత్వం కొనసాగుతోందని, అందుకే ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, ఆరు నెలల్లో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని, పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం టీవీకే పాలనలో రాష్ట్రం మునుపెన్నడూ లేని విధంగా దుస్థితిలో కొట్టుమిట్టాడుతోందన్నారు. రాష్ట్రంలో శాంతి భ ద్రతలు క్షీణించడం వల్లే పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చెప్పారు. వానగరం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన సభలో ఇతర పార్టీలకు చెందిన సుమారు ఐదు వేల మంది డీఎంకే సభ్యత్వం స్వీకరించారు. ఆ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. డీఎంకే ద్రావిడ తరహా పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందని తెలిపారు. అలాంటి రాష్ట్రం తన కళ్ల ముందే అధోగతికి చేరుకుంటుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానని ప్రశ్నించారు. టీవీకే అధికారంలోకి వచ్చాకే శాంతి భధ్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు.