ఎన్నికల కమిషనర్ల నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఉండదు
ABN , Publish Date - May 17 , 2026 | 05:05 AM
ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఉండాలని రాజ్యాంగమేమీ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఉండాలని రాజ్యాంగం చెప్పలేదు..కేంద్రం వాదన
న్యూఢిల్లీ, మే 16: ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఉండాలని రాజ్యాంగమేమీ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చోటు కల్పించడం శాసన వ్యవస్థ తీసుకున్న నిర్ణయమే తప్ప, రాజ్యాంగం నిర్దేశించినది కాదని పేర్కొంది. ఎన్నికల కమిషన్ల నియామకానికి సంబంధించిన కమిటీలో ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ల ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తిలకు స్థానం ఉండగా కేంద్ర ప్రభుత్వం దాన్ని మార్చివేసింది. ప్రధాన న్యాయమూర్తిని తొలగించి కేంద్రమంత్రికి చోటు కల్పించింది. దీనిని సమర్థించుకుంటూ ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. నియామకాల్లో న్యాయ వ్యవస్థకు చోటు కలిగిస్తే అధికారాల విభజన అన్న సూత్రానికి విఘాతం కలుగుతుందని పేర్కొంది. రాజ్యాంగంలోని 324 అధికరణం ద్వారా ఎన్నికల కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిందని, నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థకు అధికారాలు ఉన్నంత మాత్రాన ఆ స్వతంత్రతకు భంగం కలగదని తెలిపింది. ఎంపిక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి ఉండాలంటూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఏర్పాటు కింద సూచించిందే తప్ప శాశ్వత ప్రాతిపదికన ఆదేశాలు ఇవ్వలేదని గుర్తు చేసింది.