దేశమంతటా ఒకే ఒక స్వచ్ఛమైన ఓటర్ల జాబితా
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:45 AM
దేశమంతటా ఒకే ఒక స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు నిర్ణయించారు.
ఎలక్షన్ కమిషన్ సమావేశంలో డిక్లరేషన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): దేశమంతటా ఒకే ఒక స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు నిర్ణయించారు. మంగళవారం ఇక్కడ జరిగిన భారత ఎన్నికల కమిషన్, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల రౌండ్ టేబుల్ సదస్సులో ఈ మేరకు జాతీయ డిక్లరేషన్-2026ను ఏకగ్రీవంగా ఆమోదించారు. 27 సంవత్సరాల అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఇలాంటి రౌండ్ టేబుల్ సదస్సు జరగడం గమనార్హం. స్వచ్చమైన ఓటర్ల జాబితాను రూపొందించడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన, జాతీయ ప్రాధాన్యత గల విషయమని ఈ సదస్సు పేర్కొంది. పంచాయతీలు, మునిసిపల్ ఎన్నికల చట్టాలను పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల చట్టాలకు అనుగుణగా రూపొందించాలని తెలిపింది. పారదర్శకంగా, సమర్థంగా, న్యాయపరంగా బలంగా ఉండే ఎన్నికల ప్రక్రియలు అమలు అయ్యేలా చూస్తామని ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు.