బెంగాల్‌లోని ఫాల్తాలో ఎన్నిక రద్దు
ABN , Publish Date - May 03 , 2026 | 03:59 AM
పశ్చిమబెంగాల్‌లోని ఫాల్తా నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామిక ప్రక్రియను పక్కదోవ పట్టించారనే ఆరోపణలు రావడంతో ఈసీ ఎన్నికను రద్దు చేసింది.
కోల్‌కతా, మే 2: పశ్చిమబెంగాల్‌లోని ఫాల్తా నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామిక ప్రక్రియను పక్కదోవ పట్టించారనే ఆరోపణలు రావడంతో ఈసీ ఎన్నికను రద్దు చేసింది. ఈ నెల 21న ఫాల్తాలోని మొత్తం 285 పోలింగ్‌బూత్‌లలో తాజాగా మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఓటర్లను బెదిరించడం, ఈవీఎంలో బీజేపీ గుర్తు కనపడకుండా స్టికర్ వేయడం, అనధికార వ్యక్తులు పోలింగ్ బూత్‌లలోకి వచ్చారనే ఆరోపణలు వచ్చాయి. శనివారం ఫాల్తా నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఇటీవలి ఎన్నిక సందర్భంగా టీఎంసీ వర్గాలు తమను బెదిరించాయని, స్వేచ్ఛగా ఓటు వేయనీయలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. మే 4న మొత్తం 293 నియోజకవర్గాల ఫలితాలు ప్రకటిస్తారు. ఫాల్తా ఫలితాన్ని మే 24న ప్రకటిస్తారు. మరోవైపు శనివారం 2 నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్‌బూత్‌లలో రీ పోలింగ్ జరిగింది. మాగ్రాహత్ పశ్చిమ్‌లోని 11, డైమండ్ హార్బర్‌లోని 4బూత్‌లలో రీ పోలింగ్ జరిగింది. 87 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.