ఎల్‌నినోతో ఈ ఏడాది కరువు ముప్పు
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:28 AM
ఈ ఏడాది దేశంలో అనావృష్టి పరిస్థితులకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నైరుతిపై ప్రతికూల ప్రభావం: స్కైమెట్
న్యూఢిల్లీ, జనవరి 31: ఈ ఏడాది దేశంలో అనావృష్టి పరిస్థితులకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ఎల్‌నినో కారణమని వారు చెబుతున్నారు. భూమధ్య రేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడే ఛాయలు కనపడుతున్నాయని స్పష్టం చేశారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడవచ్చని కొన్ని వాతావరణ మోడళ్లు లెక్కగట్టాయి. సరిగ్గా ఇది నైరుతీ రుతుపవనాలు ఊపందుకునే సమయం. అలాగే ఉత్తరార్థ గోళంలో శీతాకాలం గరిష్ఠస్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో ఎల్‌నినో ప్రపంచ వాతావరణంపై ప్రభావం చూపనుంది. దీని ముప్పు ఎక్కువగా దక్షిణాసియా దేశాలపై ఉంటుంది. భారత్‌లో రుతుపవన వర్షాలు తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, భారతఉపఖండంలోని దేశాల్లో వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడనుంది అని స్కైమెట్ సంస్థ తొలిసారిగా అంచనా వేసింది. జూలై నెలలో ఎల్‌నినో ఏర్పడ వచ్చని, దీనితో కరువు పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆసియా, పసిఫిక్ క్లైమెట్ సెంటర్ (ఏపీసీసీ) కూడా స్పష్టం చేసింది. ఏపీసీసీ అంచనా ప్రకారం ఉష్టమండల పసిఫిక్ మహా సముద్రంలో గత నెల నుంచి లానినా బలహీనపడుతూ వస్తోంది. వచ్చే నెలకు పూర్తిగా బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఏప్రిల్ నెలలో తటస్థ పరిస్థితుల ప్రభావం బలహీనపడి ఎల్‌నినో మొదలవుతుంది.