ఖరీఫ్‌కు ఎల్ నినో ముప్పు
ABN , Publish Date - May 24 , 2026 | 03:57 AM
ఎల్‌నినో ప్రభావంతో రానున్న ఖరీఫ్ సీజన్‌లో దేశంలో వర్షాలు తక్కువగా కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది...
కేంద్రం అత్యవసర పంటల ప్రణాళిక
జిల్లా స్థాయిలో వ్యూహాలు రూపొందించుకోవాలనిరాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశం
న్యూఢిల్లీ, మే 23: ఎల్‌నినో ప్రభావంతో రానున్న ఖరీఫ్ సీజన్‌లో దేశంలో వర్షాలు తక్కువగా కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా స్థాయిలో పంటల ప్రణాళికలు, విత్తన నిల్వలు, నీటి యాజమాన్యంపై దృష్టి సారించింది. జిల్లాస్థాయిలో పంటల వ్యూహాలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆదేశించింది. నీటిని తక్కువగా వినియోగించుకొని, త్వరగా దిగుబడులు ఇచ్చే పంటల(పప్పు దినుసులు, కొన్ని రకాల చిరుధాన్యాలు, కూరగాయల) సాగును ప్రోత్సహించాలని కేంద్రం సూచించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఎల్ నినో ప్రభావంతో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం దీర్ఘకాలిక సగటులో సుమారు 92 శాతానికి పడిపోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖరువు పరిస్థితులు ఏర్పడేందుకు 35 శాతం అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే జిల్లాల్లో అనావృష్టిని తట్టుకునే విత్తన రకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటిమట్టాలను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల వ్యవసాయశాఖలను కేంద్రం ఆదేశించింది. ఎల్ నినో సంవత్సరాలలో అనేక జిల్లాల్లో ఖరీఫ్ పంటల దిగుబడి 10 శాతానికిపైగా పడిపోతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించింది.