సంఘ్ నీడ లేని చదువులు అందించాలి
ABN , Publish Date - Sep 30 , 2026 | 03:33 AM
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యారంగ సంస్కరణలపై నెల రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.
తమ సీఎంలకు కాంగ్రెస్ దిశానిర్దేశం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యారంగ సంస్కరణలపై నెల రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రతీ రాష్ట్రంలో ప్రముఖ విద్యా నిపుణులు, సంబంధిత వర్గాలతో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సులు నిర్వహిస్తారు. వాటి నుంచి వచ్చిన సూచనల ఆధారంగా సీఎంలు ఈ ప్రణాళికలు రూపొందిస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, విద్యామంత్రుల సమావేశం జరిగింది. విద్యారంగాన్ని ఉపయోగించి ఆర్‌ఎ్‌సఎస్ తన విభజన అజెండాను ముందుకు తీసుకెళ్తోందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎలా తిప్పికొట్టాలి? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు విద్యారంగంలో ఆదర్శవంతమైన రాష్ట్రాలుగా ఎలా ఎదగాలి అనే అంశాలను ఈ భేటీలో చర్చించింది.
తెలంగాణలో సంస్కరణలపై రాహుల్ హర్షం
తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రామ్ తలపెట్టినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడానికి, పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించేందుకు వీటిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సీఎంల సమావేశంలో ఆయన తెలంగాణలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను వివరించారు. 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా స్కూళ్లు వస్తున్నాయని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల విద్యార్థులు ఒకే ప్రాంగణంలో కలిసి చదువుకునేలా పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. యువతకు నైపుణ్యాలే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యామంత్రిగా తానే అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ చర్యలపై రాహుల్, ఖర్గే హర్షం వ్యక్తం చేశారు.