Share News

ప్రశ్నించే మీడియాపై ప్రభుత్వ అసహనం

ABN , Publish Date - May 27 , 2026 | 04:05 AM

మీడియా పట్ల ప్రభుత్వం అసహనం ప్రదర్శిస్తోందని, ప్రశ్నించడాన్ని తట్టుకోవడం లేదని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఈజీఐ) అభిప్రాయపడింది.

ప్రశ్నించే మీడియాపై ప్రభుత్వ అసహనం

  • అన్ని స్థాయిల్లో కనిపిస్తోంది: ఎడిటర్స్‌ గిల్ట్‌

న్యూఢిల్లీ, మే 26: మీడియా పట్ల ప్రభుత్వం అసహనం ప్రదర్శిస్తోందని, ప్రశ్నించడాన్ని తట్టుకోవడం లేదని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఈజీఐ) అభిప్రాయపడింది. అసహనం చూపించడం ఏదో ఒక సంఘటనకు పరిమితం కాలేదని, ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో ఉందని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని స్థాయిల్లోనూ ప్రశ్నించే మీడియాపై అసహనం చూపించడం ప్రత్యక్షంగా కనిపిస్తోందని తెలిపింది. నార్వే, నెదర్లాండ్‌ దేశాల్లో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ వైఖరిని జర్నలిస్టులు ప్రశ్నించారు కూడా. ఇది ఇబ్బంది కలిగించే పరిస్థితి అని ఎడిటర్స్‌ గిల్డ్‌ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ప్రకటన జారీ చేసింది. జర్నలిస్టులతో భారత అధికారులు ఘర్షణ పడిన తీరు ఆందోళన కలిగించిందని తెలిపింది. విదేశీ జర్నలిస్టులకు భారత చరిత్ర గురించి అంతగా తెలియకపోయి ఉండవచ్చని, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా ప్రశ్నించే హక్కు వారికి ఉందని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్నా ఇంతవరకు ఒక్క బహిరంగ విలేకరుల సమావేశాన్ని కూడా పెట్టకపోవడం విచారకరమని వ్యాఖ్యానించింది. మీడియాపై అసహనం ప్రజాస్వామ్య సంస్థలకే కాకుండా ఆర్థిక రంగానికి, మొత్తంగా సమాజానికి చోటు కలిగిస్తుందని హెచ్చరించింది. మొత్తం 180 దేశాలకుగానూ పత్రికా స్వేచ్ఛలో నార్వే, నెదర్లాండ్స్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, భారత్‌ 157వ స్థానంలో ఉండడాన్ని గుర్తు చేసింది.

Updated Date - May 27 , 2026 | 04:05 AM