ఐప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడులు !
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:55 AM
ప్రముఖ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్‌కు చెందిన కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందాలు గురువారం దాడులు చేశాయి...
హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో సోదాలు
పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తు
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఏప్రిల్ 2: ప్రముఖ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్‌కు చెందిన కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందాలు గురువారం దాడులు చేశాయి. పశ్చిమబెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఈడీ బృందాలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో సోదాలు నిర్వహించాయి. ఐప్యాక్ డైరెక్టర్లు, భాగస్వాములు, వారి అనుబంధ సంస్ధలకు చెందిన వారి కార్యాలయాలు, ఇళ్లల్లో సోదాలు చేపట్టాయి. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు, సంస్థ డైరెక్టర్ రిషిరాజ్ సింగ్‌కు సంబంధించి బెంగళూరులో ఉన్న ప్రాంగణంలో, ఐప్యాక్ ఎగ్జిక్యూటివ్, ఆమ్‌ఆద్మీపార్టీ కమ్యూనికేషన్స్ విభాగం మాజీ ఇన్‌చార్జి విజయ్ నాయర్‌కు సంబంధించి ముంబైలోని ప్రాంగణంలో ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో అక్రమ మైనింగ్, బొగ్గు అక్రమ రవాణాపై 2020 నవంబరులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఐప్యాక్‌కు చెందిన ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పదుల కోట్ల రూపాయాలు హవాలా మార్గంలో చేతులు మారినట్టు దర్యాప్తు సంస్థ గుర్తించింది. బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన దాదాపు రూ.20 కోట్లు హవాలా రూపంలో ఐప్యాక్‌కు చేరినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఇక, బొగ్గు కుంభకోణం కేసులో వాంగ్మూలం నమోదు కోసం రిషిరాజ్ సింగ్, ప్రతీక్ జైన్‌కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ వారిద్దరూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాము తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల పనుల్లో ఉన్నట్టు కోర్టుకు తెలియజేశారు.