Share News

రూ.95 కోట్ల మనీ ట్రయల్‌ బద్దలు

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:04 AM

విదేశీ నిధులను చట్టాల కళ్లు కప్పి దేశంలోకి తీసుకురావడానికి హ్యాండర్లు పెద్ద ఎత్తుగడే పన్నారు. విదేశాల్లో జారీ అయిన డెబిట్‌ కార్డులను ..

రూ.95 కోట్ల మనీ ట్రయల్‌ బద్దలు

  • విదేశీ డెబిట్‌ కార్డులతో ఏటీఎంల నుంచి భారీగా నగదు లాగేసినట్టు గుర్తించిన ఈడీ అధికారులు

  • ఓ స్వచ్ఛంద సంస్థ పేరు తెరపైకి

భోపాల్‌, ఏప్రిల్‌ 25: విదేశీ నిధులను చట్టాల కళ్లు కప్పి దేశంలోకి తీసుకురావడానికి హ్యాండర్లు పెద్ద ఎత్తుగడే పన్నారు. విదేశాల్లో జారీ అయిన డెబిట్‌ కార్డులను వాడి మనదేశంలోని ఏటీఎంల నుంచి పెద్దఎత్తున నగదును లాగేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా ఆరు చోట్ల మెరుపు దాడులు జరిపి సుమారు రూ.95 కోట్ల విలువైన మనీ ట్రయల్‌ గుట్టును రట్టు చేశారు. ఈ క్రమంలో ఈడీ అధికారులనే నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ద తిమోతీ ఇనిషియేటివ్‌’(టీటీఐ) అనే స్వచ్ఛంద సంస్థ పేరు మనీ ట్రయల్‌లో తెరపైకి వచ్చింది. క్రైస్తవ ప్రచారం, చర్చిల నిర్మాణం ఆశయంగా పనిచేసే అంతర్జాతీయ సంస్థ ఇది. దీనితోపాటే మావోయిస్టుల ప్రమేయం గురించీ అనుమానాలు కలుగుతున్నాయి. ఈ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. మనదేశంలో ద్రవ్య నిబంధనలు కఠినంగా ఉంటాయి. విదేశాల నుంచి మనదేశంలోకి జరిగే లావాదేవీలపై గట్టి నిఘా ఉంటుంది. ఈ నిఘాను దాటుకుని విదేశీ నిధులను దేశంలోకి తీసుకురావడం కోసం ప్రత్యేక వ్యవస్థనే సృష్టించారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకుకు చెందిన 25విదేశీ బ్యాంకు డెబిట్‌ కార్డులు, రూ.40లక్షల నగదును, కొన్ని డిజిటల్‌ పరికరాలను, అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను సోదాల్లో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌లోనే గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రూ. 6.5 కోట్ల విలువైన లావాదేవీలు నడిచినట్టు గుర్తించారు. దీన్నిబట్టి ఈ వ్యవహారంలో మావోయిస్టుల పాత్ర ఉండొచ్చునని భావిస్తున్నారు. భారీగా డ్రాచేసిన నగదు ‘టీటీఐ’ మతమార్పిడి కార్యక్రమాల కోసం ఉపయోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిజానికి ఈ స్వచ్ఛంద సంస్థ ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద నమోదు కాలేదు.

Updated Date - Apr 26 , 2026 | 04:04 AM