Share News

ED and Mamata Banerjee Clash in Supreme Court: సుప్రీంకు ఈడీ-దీదీ పోరు

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:08 AM

పశ్చిమబెంగాల్‌ సీఎం మమత, ఈడీ మధ్య పోరు కలకత్తా హైకోర్టులో రసాభాసగా మారిన నేపథ్యంలో ఇరుపక్షాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ED and Mamata Banerjee Clash in Supreme Court: సుప్రీంకు ఈడీ-దీదీ పోరు

  • అత్యున్నత న్యాయస్థానంలో ఇరువర్గాల పిటిషన్లు

  • మమతా బెనర్జీ చర్యలు ‘బల ప్రదర్శనే’: ఈడీ

  • మా వాదన వినకుండా ఆదేశాలు జారీ చేయొద్దు: ప్రభుత్వం

న్యూఢిల్లీ, జనవరి 10: పశ్చిమబెంగాల్‌ సీఎం మమత, ఈడీ మధ్య పోరు కలకత్తా హైకోర్టులో రసాభాసగా మారిన నేపథ్యంలో ఇరుపక్షాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కేసు విచారణను శుక్రవారం హైకోర్టు ఈనెల 14వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బొగ్గు స్కామ్‌పై విచారణలో భాగంగా ఈడీ అధికారులు చేపట్టిన తనిఖీలను, ఆధారాల సేకరణను సీఎం మమత మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారని ఆ పిటిషన్‌లో ఈడీ ఆరోపించింది. పశ్చిమెబెంగాల్‌లో మరో 4నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) పార్టీ ఎన్నికల వ్యూహల కోసం పనిచేస్తున్న ఐ-ప్యాక్‌ సంస్థ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఇంట్లో గురువారం ఈడీ సోదాలు చేపట్టగా, తమ ఎన్నికల వ్యూహాలను చోరీ చేసేందుకే ఈడీ ఈ దాడులు చేపట్టిందని టీఎంసీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈడీ తీరుకు నిరసనగా మమతా బెనర్జీ భారీ ప్రదర్శన కూడా నిర్వహించారు. సోదాల సందర్భంగా అక్కడ జరిగిన వరుస ఘటనలను ఈడీ తన పిటిషన్‌లో వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ‘బలప్రదర్శన’గా ఆక్షేపించింది. ఈ అంశంలో పోలీసులు సహా రాష్ట్ర అధికారులు జోక్యం చేసుకోవడం.. బొగ్గు స్మగ్లింగ్‌ స్కామ్‌ దర్యాప్తు సమగ్రతపై రాజీ పడినట్టు స్పష్టమవుతోందని పేర్కొంది. స్వేచ్ఛాయుతంగా, స్వతంత్రంగా దర్యాప్తు జరిపే తమ హక్కును రాష్ట్ర యంత్రాంగం హరించిందని ఆక్షేపించింది. అక్కడ జరిగిన ఘటనలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది. బొగ్గుస్కామ్‌కు సంబంధించిన రూ.20 కోట్లను హవాలా మార్గాల ద్వారా ఐప్యాక్‌కు మళ్లించినట్టు కీలకమైన ఆధారాలను దర్యాప్తులో గుర్తించామని, అయితే, సోదాల సమయంలో ప్రతీక్‌ జైన్‌ ఇంట్లోకి మమత ప్రవేశించి కీలక ఆధారాలను లాక్కెళ్లిపోయారని ఆరోపించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద చేపట్టిన సోదాల్లో జోక్యం చేసుకోవద్దని తాము అభ్యర్థించినప్పటికీ మమత పోలీసుల సాయంతో బలవంతంగా కీలకమైన పత్రాలు, డిజిటల్‌ పరికరాలను లాక్కున్నారని తెలిపింది. అలాగే, ఐదుగురు సాక్షులను ‘సమర్థవంతంగా హైజాక్‌’ చేశారని ఈడీ ఆరోపించింది. ఆ పత్రాలు, డిజిటల్‌ పరికరాలను వారు వినియోగించకుండా, తొలగించకుండా, క్లోనింగ్‌, మార్పుచేర్పులు చేయకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరింది.


బెంగాల్‌ ప్రభుత్వం కెవియెట్‌ ..

మరోవైపు ఈ అంశంలో తమ వాదన వినకుండా ఎటువంటి ఆదేశమూ జారీ చేయవద్దని కోరుతూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో కెవియెట్‌ దాఖలు చేసింది. కోల్‌కతాలోని ప్రతీక్‌ జైన్‌ నివాసంతోపాటు, నగర శివారులోని మరో కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ రెండు పోలీసుస్టేషన్లలో మమత శుక్రవారమే ఫిర్యాదులు చేశారు. తమ పార్టీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన కీలక పత్రాలను చోరీ చేశారని ఆమె ఆరోపించారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా కోల్‌కతా, బిధన్‌నగర్‌ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో దర్యాప్తును పోలీసులు శనివారం ప్రారంభించారు.

Updated Date - Jan 11 , 2026 | 05:17 AM