గల్లంతయిన ఓట్ల కోసం ఈసీ ప్రత్యేక డ్రైవ్!
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:42 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో అర్హుల పేర్లు గల్లంతయ్యాయన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) దిద్దుబాటు చర్యలకు దిగింది.
సర్ పూర్తైన రాష్ట్రాల్లో అమలు
పాత, కొత్త జాబితాలతో ఇంటింటికీ బీఎల్వోలు
సాధారణ ఫామ్-6 తోనే కొత్త ఓటరుగా నమోదు
నెలలో పూర్తి చేయాలని టార్గెట్
న్యూఢిల్లీ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో అర్హుల పేర్లు గల్లంతయ్యాయన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. సర్ ఇప్పటికే పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించింది. ఓటర్ల జాబితాలో చోటు దక్కని వారిని, కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్లను చేర్చడం దీని లక్ష్యం. ఈ ఆదేశాలు సెప్టెంబరు 29న జారీ కాగా, గురువారం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల(సీఈవో)తో వీడియో కాన్ఫరెన్స్‌లో మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక డ్రైవ్‌లో బూత్ స్థాయి అధికారులు(బీఎల్వోలు) ప్రస్తుత జాబితాను, సర్‌కు ముందున్న జాబితాతో పోల్చి, తొలగిపోయిన పేర్లను గుర్తిస్తారు. వారి ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తారు. ఒక్కో బీఎల్‌వో వారానికి 20-25 మందిని పరిశీలించి, నెలరోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హులైన వారి నుంచి, యువ ఓటర్ల నుంచి అక్కడికక్కడే ఫారం-6 స్వీకరిస్తారు. ఆ జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు(బీఎల్‌ఏ) అందజేస్తారు. నిరాశ్రయులు, అణగారిన వర్గాల కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తారు. దరఖాస్తుదారు పేరు కానీ, తల్లిదండ్రుల పేర్లు కానీ గత సర్ జాబితాలో ఉన్నాయా? అన్న ప్రశ్నను ఈసీ గత జూలైలో ఫామ్-6లో చేర్చింది. ఈ ప్రశ్నను సర్ దశకే పరిమితం చేశారు. దీంతో ప్రత్యేక డ్రైవ్‌లో సాధారణ పాత ఫామ్-6 సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఇంకా సర్ ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలి అనుకునే వారు మార్చిన కొత్త ఫామ్-6నే వాడాల్సి ఉంటుంది. సర్ పూర్తయి, కొత్త ఓటర్ల జాబితాను ముద్రించగానే ఈ 20రాష్ట్రాల తరహాలోనే పాత ఫామ్-6తో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.