ఈసీలో అసలేం జరుగుతోంది?
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:57 AM
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సభ్యుల మధ్య విభేదాలు వచ్చినట్లు వెలువడిన నివేదికలపై స్పష్టత ఇవ్వాలని ఎడ్డీయే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలు కోరాయి.
అంతర్గత విభేదాలపై స్పష్టత ఇవ్వాల్సిందే.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల డిమాండ్
పారదర్శకతతోనే ఈసీపై నమ్మకం పెరుగుతుంది: టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
సమస్యేమిటో కమిషన్ సభ్యులే నేరుగా వివరించాలి: కేంద్ర మంత్రి కుమారస్వామి
ఎన్నికల వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లడం మంచిది కాదు: కేంద్ర మంత్రి పాసవాన్
‘సర్’తో ప్రజల్లో గందరగోళం: ఆర్‌ఎల్‌ఎం అధినేత కుశ్వాహ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సభ్యుల మధ్య విభేదాలు వచ్చినట్లు వెలువడిన నివేదికలపై స్పష్టత ఇవ్వాలని ఎడ్డీయే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలు కోరాయి. ప్రజల్లో ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశాయి. ‘సర్’ ప్రక్రియకు సంబంధించి నెలకొన్న ఆందోళనలపై ఈసీ వివరణ ఇవ్వాలని టీడీపీ, జేడీఎస్, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం), లోక్ జనశక్తి(ఎల్‌జేపీ) పార్టీల నేతలు కోరారు. ‘మన ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ఎన్నికల సంఘం కీలక బాధ్యతలు కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ. ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తినప్పుడు తగిన వివరణ ఇవ్వడం, పారదర్శకతను పాటించడం అనేది ఆ సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతుంది’ అని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు. ఏపీలో ‘సర్’ అత్యంత పారదర్శకంగా జరిగిందని, అందులో పాల్గొనడానికి, తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి ప్రతి ఓటరుకూ తగిన అవకాశాలు, సరిపడా సమయం కల్పించారని తెలిపారు. కాగా, ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఈసీలో అసలేం జరుగుతోందని కేంద్ర మంత్రి, జేడీఎస్ సీనియర్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి ప్రశ్నించారు. ఈసీ అనేది ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని, అందువల్ల కమిషన్ సభ్యులే నేరుగా ప్రజల ముందుకొచ్చి వాస్తవ పరిస్థితులను వివరించాలని కోరారు. ఈసీలో ముగ్గురు కమిషనర్లు ఉన్నారని, సమస్య ఏమిటో, లోపం ఎక్కడుందో వారే చెప్పాలన్నారు.
మరో కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ మాట్లాడుతూ... ప్రజల్లో నెలకొన్న అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని, ఆరోపణలపై మరింత స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. తాను ఈసీ తరఫున మాట్లాడటం లేదని, అలాగే ప్రతిపక్షాల ఆరోపణలను సమర్థించడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మరోవైపు ఆర్‌ఎల్‌ఎం అధినేత ఉపేంద్ర కుశ్వాహ ఈ అంశంపై స్పందించారు. ‘సర్ వివాదం ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. పరిస్థితిని చక్కదిద్దడానికి ఈసీ తక్షణమే ఒక స్పష్టత ఇవ్వాలి’ అని కోరారు.