ఈ ప్రశ్నలకు జవాబులేవి?
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:55 AM
కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు కమిషనర్లు సమావేశమై, అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామంటూ ప్రకటన విడుదల చేసినా.. ఎన్నో చిక్కుముడులు అలాగే ఉండిపోయాయి.
ఫారం-6లో మార్పులు, బెంగాల్ అప్పీళ్లు తదితర అంశాలపై స్పష్టత కరువు
ఈసీ ప్రకటనలో చిక్కుముడులెన్నో..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు కమిషనర్లు సమావేశమై, అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామంటూ ప్రకటన విడుదల చేసినా.. ఎన్నో చిక్కుముడులు అలాగే ఉండిపోయాయి. ముఖ్యంగా ఫారం-6లో మార్పులు, బెంగాల్ అప్పీళ్లు, ఓటర్ల డాటాబేస్ పై ఐటీ విభాగం పర్యవేక్షణ తదితర అంశాలపై ఈసీ నుంచి సరైన స్పష్టత రాలేదని అంటున్నారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కీలకమైన ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో 4నెలలపాటు ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ముఖాముఖి ఎందుకు సమావేశం కాలేదన్న ప్రశ్నకు సమాధానం రాలేదు. పశ్చిమబెంగాల్‌లో తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చాలని న్యాయస్థానాలు ఆదేశించిన తర్వాత.. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్ తరఫున 16.10 లక్షల అప్పీళ్లను దాఖలు చేయాలన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఆ అప్పీళ్ల అంశంపై ఎన్నికల కమిషర్లు జోషి, సంధూలకుగానీ, పశ్చిమ బెంగాల్ సీఈవోకు గానీ ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న ప్రశ్నలనూ ఈసీ విస్మరించింది. ఫారం-6లో మార్పులను సుప్రీంకోర్టు ఆమోదించిందని ఈసీ సమర్థించుకున్నా.. ఆ అంశంపై అంతర్గత నిర్ణయ ప్రక్రియ ఎలా జరిగిందో ఈసీ వివరించలేదు. ఓటర్ల జాబితాలో తొలగించిన వారి పేర్లను పునరుద్ధరించేందుకు, తమ నిర్ణయాలను రికార్డు చేసేందుకు పోర్టల్‌లో ఈఆర్‌వోలకు అవకాశం లేకపోవడంపైనా ఈసీ స్పందించలేదు. గోవాలో 97మంది ఓటర్ల గురించి వివరణ ఇవ్వలేదు. ఐటీ డీజీపై తమకు పర్యవేక్షణ లేకుండా చేయడంపై ఇద్దరు ఎన్నికల కమిషర్లు కేంద్ర కేబినెట్ సెక్రెటరీకి లేఖరాయడంపైనా ఈసీ దాటవేత ధోరణిని ప్రదర్శించింది. అది చిన్న పరిపాలనా సమస్యగా పేర్కొంది.