ఫారం-6లో మార్పులు అనుబంధ వివరాల కోసమే!
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:53 AM
తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకునేవారు సమర్పించాల్సిన ఫారం-6లో మార్పులేమీ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం పేర్కొంది.
పాత ‘సర్’లోని తల్లిదండ్రులు, తాతనానమ్మల వివరాలు ఇవ్వడాన్ని అదనంగానే జత చేశాం
వివరణ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
కానీ ఆ వివరాలు ఇవ్వకుంటే ఫారం-6 సమర్పించలేని పరిస్థితి ఉందన్న కొత్త ఓటర్లు
ఈసీఐనెట్ నుంచి డిలీట్ చేసిన ఓటర్ల వివరాలను పునరుద్ధరించలేమన్న ఈసీ
పోర్టల్‌లో ఈఆర్‌ఓలకు పూర్తి యాక్సెస్ ఉందని వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకునేవారు సమర్పించాల్సిన ఫారం-6లో మార్పులేమీ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం పేర్కొంది. అందులో కేవలం అనుబంధ పత్రంగా సదరు దరఖాస్తుదారుల బంధువుల పాత ‘సర్’ వివరాలకు సంబంధించి కొత్త విభాగాన్ని జత చేశామని తెలిపింది. ఫారం-6లో మార్పులు చట్టవిరుద్ధమంటూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. గత పది నెలల్లో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి 14 అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఈ ఫారం-6 మార్పుల అంశం కూడా ఒకటి. 1960 నాటి చట్టంలోని ఓటర్ల నమోదు నిబంధనలకు సవరణ చేయకుండా.. బంధువుల ‘సర్’ వివరాలు అడగడం చట్టవిరుద్ధం, అనధికారికమని సంధూ, వివేక్ జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ సీఈసీ ఓపీ రావత్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా కూడా దీనిని సమర్థించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం తాజాగా వివరణ ఇచ్చింది. నిజానికి ఫారం-6 ఆన్‌లైన్ దరఖాస్తులో బంధువుల ‘సర్’ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని (నాన్ మ్యాండేటరీ) కనిపిస్తుంది. కానీ చాలా మంది దరఖాస్తుదారులు అందులో వివరాలు ఇవ్వకుండా ముందుకు వెళ్లలేకపోయామని పేర్కొంటుండటం గమనార్హం.
తొలగిస్తే మళ్లీ పునరుద్ధరించలేం..
గోవాలో 97 మంది అర్హుల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చలేకపోయిన అంశంపైనా ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఈఆర్‌ఓలు ఒకసారి ఈసీఐనెట్ పోర్టల్ నుంచి ఫారం-7 ద్వారా తొలగించిన ఓటర్ల వివరాలను పునరుద్ధరించడానికి అవకాశం లేదని పేర్కొంది. వయసు, బంధుత్వాల్లో తేడాలతో తొలగించిన ఓటర్లలో.. పరిశీలన అనంతరం ఈఆర్‌ఓలు కొందరిని అర్హులుగా గుర్తించినా, తుది ఓటర్ల జాబితాలో చేర్చలేకపోయినట్టు వివరించింది. ఇక ఓటర్ల జాబితాలపై జాతీయ స్థాయిలోనే నిర్ణయం తీసుకునేలా కేంద్రీకరిస్తున్నారనే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఓటర్ల జాబితాల రూపకల్పన, ఓటరు దరఖాస్తుల ఆమోదం, తిరస్కారం, ఓటర్ల తొలగింపు, తుది ఓటర్ల జాబితాలను ప్రకటించడమనే ప్రక్రియ అంతా సంబంధిత ఈఆర్‌ఓలు, రాష్ట్ర సీఈవోల పరిధిలోనే ఉందని పేర్కొంది. ఈఆర్‌ఓలు చట్టబద్ధమైన విధులు నిర్వహించడం కోసం ఈసీఐనెట్ పోర్టల్‌లో ఎలాంటి ఆంక్షలు లేకుండా వివరాలను యాక్సెస్ చేసే అధికారం ఉందని తెలిపింది. అయితే కీలక సందేహాలకు మాత్రం ఎన్నికల సంఘం సమాధానాలు ఇవ్వలేదు. ‘ఓటర్ల వివరాలను పునరుద్ధరించే ఆప్షన్ ఇవ్వాలని గోవా ఎన్నికల అధికారులు పదేపదే కోరినా.. ఎందుకు ఆప్షన్ ఇవ్వలేదు? ఫారం-6లో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? పలు అంశాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు తెలిపినా.. నిర్ణయాలు తీసుకుని, ఆదేశాలు ఎందుకు జారీ చేశారు?’ అన్న ప్రశ్నలకు మాత్రం ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వలేదు.