Share News

మెజారిటీ నిర్ణయాలు కాకుంటే చట్టవిరుద్ధమే!

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:09 AM

‘సర్‌’, ఓటర్ల జాబితాల ప్రక్రియలపై ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వచ్చిన వార్తలపై కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్లు ఎస్‌వై ఖురేషీ, ఓపీ రావత్‌ స్పందించారు.

మెజారిటీ నిర్ణయాలు   కాకుంటే చట్టవిరుద్ధమే!
SIR

  • ’సర్‌’పై పారదర్శకత అవసరం: ఖురేషీ

  • సర్‌ను పెద్దభూతంలా మార్చారు: రావత్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: ‘సర్‌’, ఓటర్ల జాబితాల ప్రక్రియలపై ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వచ్చిన వార్తలపై కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్లు ఎస్‌వై ఖురేషీ, ఓపీ రావత్‌ స్పందించారు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ) మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోకుంటే.. ఆ నిర్ణయాలు చట్టవిరుద్ధమే అవుతాయని ఖురేషీ స్పష్టంచేశారు. ‘కమిషన్‌ గత ఏడాదిన్నరగా తీసుకున్న నిర్ణయాలేమిటో జాబితాను బహిర్గతం చేయాలి. మంచివైనా.. చెడువైనా ఏకగ్రీవమైతే ఆ నిర్ణయాలు చెల్లుబాటవుతాయి. మెజారిటీ ప్రకారం తీసుకున్న నిర్ణయాలు కూడా చట్టబద్ధమే. వాటినెవరూ సవాల్‌ చేయలేరు. అయితే సహచర కమిషనర్లను తోసిరాజని.. వారి అభ్యంతరాలను తోసిపుచ్చి మైనారిటీ నిర్ణయాలు తీసుకుంటే అవి చట్టవిరుద్ధం. వాటన్నిటినీ రద్దుచేయాలి’ అని ఖురేషీ స్పష్టంచేశారు. సర్‌ పై పారదర్శకత అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా.. ఎన్నికల కమిషనర్ల నడుమ విభేదాలు చాలా తీవ్రమైనవని.. ఇది దురదృష్టకరమని రావత్‌ అన్నారు. తాను సీఈసీగా ఉన్నప్పుడు ఏకగ్రీవ నిర్ణయాలే తీసుకున్నామని చెప్పారు. సర్‌ ప్రక్రియను పెద్ద భూతంలా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Sep 24 , 2026 | 06:13 AM