ప్రాసిక్యూషన్ భయం అక్కర్లేదు
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:11 AM
గత ఓటర్ల జాబితాలో నమోదై ఉండి, ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సందర్భంగా విడుదల చేసిన ముసాయిదా జాబితాలో పేర్లు గల్లంతైన వారు..
సర్ ముసాయిదాలో పేర్లు గల్లంతైన వారు ఫారం-6తో అప్లై చేసుకోవచ్చు
సుప్రీంకోర్టులో ఈసీ అఫిడవిట్
న్యూఢిల్లీ, నవంబరు 15: గత ఓటర్ల జాబితాలో నమోదై ఉండి, ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సందర్భంగా విడుదల చేసిన ముసాయిదా జాబితాలో పేర్లు గల్లంతైన వారు.. తిరిగి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రాసిక్యూషన్ (చట్టపరమైన విచారణ/క్రిమినల్ చర్యలు) చేపట్టబోమని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. గతంలో ఓటర్లుగా నమోదైనప్పటికీ, సర్ ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించకపోవడంతో ఫారం6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేస్తే.. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 31 కింద చర్యలు తీసుకుంటారనే ఆందోళనలు తమ దృష్టికి వచ్చాయని ఈసీ పేర్కొంది. ఈ అపోహలను తొలగించేందుకు స్పష్టత ఇచ్చినట్లు తెలిపింది. అయితే, దరఖాస్తుదారుడి పేరు ఏ ఇతర పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఉండకూడదని షరతు విధించింది. ఏఎస్ఎస్ డీ(చిరునామాలో లేని, వలసపోయిన) ఓటర్లను సైతం ఎన్నికల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఈసీ తెలిపింది. ఈ క్రమంలో జాబితాలో పేర్లు గల్లంతైన వారు తాము నివసించే చోటే ఈఆర్‌వో లేదా ఏఈఆర్‌వో లేదా బీఎల్‌వోకు ఎన్యుమరేషన్ ఫారం సమర్పించేందుకు అనుమతించాలని రాష్ట్రాల సీఈవోలను ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ఎన్యుమరేషన్ ఫారం(అనెక్స్యూర్-ఏ)తోపాటు గతంలో ఎందుకు సమర్పించలేదన్న వివరణ (అనెక్స్యూర్-బి) తీసుకుంటున్నట్టు తెలిపింది.