Share News

ఢిల్లీ ‘సర్‌’లో నోటీసులు అందుకున్న ప్రముఖుల పేర్లపై ఈసీ స్పష్టత

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:12 AM

ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న పలువురు ప్రముఖుల పేర్లకు సంబంధించి ఎన్నికల అధికారులు స్పష్టత ఇచ్చారు

ఢిల్లీ ‘సర్‌’లో నోటీసులు అందుకున్న   ప్రముఖుల పేర్లపై ఈసీ స్పష్టత
ec

  • క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం

తుది జాబితాలో చోటు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న పలువురు ప్రముఖుల పేర్లకు సంబంధించి ఎన్నికల అధికారులు స్పష్టత ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వారి వివరాలను ధ్రువీకరించడంతో పాటు వారి పేర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు రిజర్వు చేసినట్లు తెలిపారు. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, ఢిల్లీ సీఎం రేఖాగుప్తా, మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు సర్‌లో భాగంగా నోటీసులు జారీ అయ్యాయి. వారి ఎన్యూమరేషన్‌ ఫారాల్లోని కొన్ని వివరాల్లో వ్యతాసాలు ఉన్నట్లు గుర్తించడంతో అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా 2002లో ఢిల్లీలో నిర్వహించిన గత సర్‌ ఓటర్ల జాబితాతో వారి వివరాలు సరిపోలకపోవడం వల్లే చాలా మందికి నోటీసులు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లే. కాగా, కొన్నిరోజులుగా బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్వోలు) నేరుగా ఆ ఓటర్ల నివాసాలకు వెళ్లి, ఈసీ సూచించిన పత్రాల ఆధారంగా వారి వివరాలను పరిశీలించారు. ధ్రువీకరణ అనంతరం నవంబరు 4న ప్రచురించబోయే తుది జాబితాలో వారి పేర్లను చేర్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఓటర్లకు నోటీసులు జారీచేయడం అంటే వారి పేర్లను తొలగించడం కాదని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

Updated Date - Sep 26 , 2026 | 05:12 AM