మానవాళి అంతానికి మౌన సాక్ష్యం!
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:23 AM
విమానం కూలిపోతే.. అది ఎందుకు కూలింది? క్రాష్ కావడానికి ముందు పైలట్లు ఏం మాట్లాడుకున్నారు? ఈ వివరాలన్నీ ‘బ్లాక్ బాక్స్’లో రికార్డవుతాయన్న సంగతి తెలుసు కదా..! అచ్చం అలాగే..
‘ఎర్త్స్ బ్లాక్ బాక్స్’ పేరుతో టాస్మేనియాలో భారీ ఉక్కు కట్టడం
52 అడుగుల పొడుగు.. 13 అడుగుల ఎత్తైన బలమైన నిర్మాణం
వినాశనం దిశగా మనం నిర్లక్ష్యంగా వేసే ప్రతి అడుగునూ సాక్ష్యాలతో రికార్డు చేసే హార్డ్‌డ్రైవ్‌లు ఇందులో నిక్షిప్తం
విమానం కూలిపోతే.. అది ఎందుకు కూలింది? క్రాష్ కావడానికి ముందు పైలట్లు ఏం మాట్లాడుకున్నారు? ఈ వివరాలన్నీ ‘బ్లాక్ బాక్స్’లో రికార్డవుతాయన్న సంగతి తెలుసు కదా..! అచ్చం అలాగే.. ఒకవేళ భవిష్యత్తులో మానవాళి మొత్తం అంతమైపోయి.. ఆ తర్వాత ఎప్పుడో ఎవరైనా గ్రహాంతరవాసులు ఇక్కడికి వచ్చినా, లేక మళ్లీ మానవజాతి కొత్తగా పురుడు పోసుకున్నా.. అసలు ఏం జరిగిందో, మానవాళి ఎలా అంతమైందో వారికి తెలియడం కోసం ఒక బ్లాక్ బాక్స్ ఉంటే? ..అనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా? ఆస్ట్రేలియాలోని ‘రౌజర్‌ల్యాబ్’, ‘ద గ్లూ సొసైటీ’ సంస్థలకు అలాంటి ఆలోచనే వచ్చింది. నానాటికీ పెరిగిపోతున్న భూతాపం కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తున్నా.. అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నా ప్రజల్లోగానీ, పాలకుల్లోగానీ చలనం రావట్లేదని వారు భావించారు. అందుకే ప్రజల్లో, పాలకుల్లో భవిష్యత్తుపై భయాన్ని, బాధ్యతను పెంచడానికి... ‘ఎర్త్స్ బ్లాక్ బాక్స్’ అనే కళాత్మక, సాంకేతిక ప్రయోగాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఆస్ట్రేలియాకు దక్షిణంగా ఉన్న టాస్మేనియా ద్వీపాన్ని ఎంచుకుని అక్కడ ఈ ‘ఎర్త్స్ బ్లాక్ బాక్స్’ను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరికి దాని నిర్మాణం పూర్తి కానున్నట్టు సమాచారం. ఇదెలా ఉంటుందంటే.. 52 అడుగుల పొడుగు, 13 అడుగుల ఎత్తున.. ఒక భారీ సిటీ బస్సు పరిమాణంలో ఉంటుంది. 50 కోట్ల సంవత్సరాలుగా ఆ ద్వీపంలో చెక్కుచెదరకుండా ఉన్న ఒక భారీ గ్రానైట్ శిలపై దీన్ని నిర్మిస్తున్నారు. 3 అంగుళాల మందపాటి ఉక్కు, గ్రానైట్, కాంక్రీట్‌తో నిర్మిస్తున్న ఈ భారీ దిమ్మెలాంటి ఆకారం లోపలి భాగంలో కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లను అమరుస్తారు. అతి తీవ్ర భూకంపాలు, వరదల వంటి ఎలాంటి ప్రకృతి ఉత్పాతాలు వచ్చినా చెక్కు చెదరకుండా దీన్ని నిర్మిస్తున్నారు. భయంకరమైన మంటలు చుట్టుముట్టినా లోపల ఉన్న హార్డ్ డిస్క్‌లకు ఏమీ కాకుండా.. లోపలిభాగంలో ప్యాసివ్ థర్మల్ ప్రొటెక్షన్ అనే అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారు.
సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే.. బయట 3 అంగుళాల మందంగల ఉక్కుతో బలంగా ఉండే ఈ నిర్మాణం మనం వాడే ‘ఫ్లాస్క్’లా ఉంటుంది. లోపల ఉన్న కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్‌లు పనిచేయడానికి అవసరమైన విద్యుత్తు కోసం దీని పైభాగంలో సౌరఫలకాలను అమరుస్తున్నారు. వాటి చుట్టూ బలమైన గాజు కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది ఎంత బలమైనదంటే.. ఆమ్లవర్షాలు కురిసినా, మంచుతుఫానులు వచ్చినా చెక్కుచెదరదు. కొన్ని నెలలపాటు సూర్యుడు కనిపించకపోయినా.. ఈ నిర్మాణంలోని థర్మో ఎలక్ట్రిక్ సిస్టమ్ రంగంలోకి దిగి, పగటి-రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడా ఆధారంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇక, దీని లోపలున్న హార్డ్‌డ్రైవ్‌లు ఏం చేస్తాయంటే.. ప్రపంచంలోని వివిధ అంతరిక్ష పరిశోధనల సంస్థలు, వాతావరణ కేంద్రాలు, యూనివర్సిటీల నుంచి.. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయులను, సముద్రాల ఉష్ణోగ్రతలను, జీవజాతుల్లో ఏవేవి అంతరిస్తున్నాయి? ఎంత వేగంగా అంతరిస్తున్నాయి? అవి అంతరించడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావం ఏమిటి? ఎంత?, వివిధ దేశాల సైనిక వ్యయాలు, వినాశనం దిశగా ప్రపంచ దేశాల నేతలు తీసుకునే నిర్ణయాలు, వాతావరణ మార్పులపై నాయకులు చేసిన ప్రసంగాలు, వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు.. ఇలా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తుంది. మానవాళి అంతం దిశగా మనం నిర్లక్ష్యంగా వేసే ప్రతి అడుగును, రాజకీయ నాయకుల అసమర్థతను సాక్ష్యాలతో సహా రికార్డు చేస్తుంది.
అక్కడే ఎందుకంటే..
దీన్ని టాస్మేనియాలోనే ఎందుకు నిర్మిస్తున్నారంటే.. రాజకీయంగా, వాతావరణపరంగా అది భూమ్మీద అత్యంత స్థిరమైన ప్రాంతం. భూమి లోపల ఉండే టెక్టానిక్ ప్లేట్లు కదలడం వల్లే భూకంపాలు వస్తుంటాయి. టాస్మేనియా అలాంటి ప్లేట్లకు దూరంగా ఉన్న అత్యంత నిలకడైన భూభాగం. అందుకే ఆ దీవిలోని గ్రానైట్ శిలలు 50 కోట్ల సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. అలాంటి ఒక శిలపైనే దీన్ని నిర్మిస్తున్నారు. రాబోయే కొన్ని వేలు, లక్షల ఏళ్లపాటు అక్కడ ఎలాంటి భూకంపాలూ వచ్చే ఆస్కారం లేదు. అంతేకాదు.. ఇది రాజకీయంగా కూడా అత్యంత సురక్షితమైన ప్రాంతం. ఎలాంటి అంతర్జాతీయ గొడవల్లోనూ తలదూర్చని ప్రాంతమిది. అందుకే ఈ ప్రాజెక్టుకు వారు టాస్మేనియాను ఎంచుకున్నారు.
-సెంట్రల్ డెస్క్