Share News

గంటల వ్యవధిలో 3 ఖండాల్లో భూకంపాలు

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:45 AM

వెనెజువెలాలో నిమిషాల వ్యవధిలో సంభవించిన భూకంపాలు ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అయితే, వెనెజువెలాలో భూమి ...

గంటల వ్యవధిలో 3 ఖండాల్లో భూకంపాలు

న్యూఢిల్లీ, జూన్‌ 25: వెనెజువెలాలో నిమిషాల వ్యవధిలో సంభవించిన భూకంపాలు ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అయితే, వెనెజువెలాలో భూమి కంపించిన సమయానికి అటు ఇటుగా గంటల తేడాలో అమెరికాలోని కాలిఫోర్నియాలోనూ, జపాన్‌లోనూ భూమి కంపించింది. గంటల తేడాల్లో మూడు ఖండాల్లో భూకంపించగా.. వీటి మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే చర్చ మొదలైంది. భారత కాలమాన ప్రకారం జూన్‌ 25వ తేదీ తెల్లవారుజామున మూడు గంటల 34 నిమిషాలప్పుడు వెనెజువెలాలో 7.2 తీవ్రతతో భూమి కంపించింది. అక్కడికి నిమిషంలోపే 7.5 తీవ్రతతో మరోసారి కంపించింది. అక్కడికి 30 నుంచి 40 నిమిషాల తర్వాత జపాన్‌లో 7.2 తీవ్రతతో భూప్రకంపనలు ఏర్పడ్డాయి. అంతకముందు జూన్‌ 24వ తేదీ రాత్రి ఎనిమిది గంటల 40 నిమిషాలప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో 5.6 తీవ్రతతో భూమి కంపించింది. ఇలా కాలిఫోర్నియా, వెనెజువెలా, జపాన్‌ల్లో వరుసగా భూమి కంపించింది. అయితే, ఈ భూకంపాలకు ఒకదానితో మరొక దానికి ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. వేర్వేరు ఖండాల్లోని ఈ మూడు ప్రాంతాలు వేర్వేరు భూఫలకాలపై ఉండడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఓ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ప్రభావం చూపే అవకాశం చాలా తక్కువని వెల్లడించారు. అంతేకాక, భూమిలో ప్రతీ రోజు వేలకొద్దీ ప్రకంపనలు రికార్డవుతాయని, వీటిలో చాలా ప్రకంపనల తీవ్రతను కనీసం గుర్తించలేమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, ఓ ప్రకంపన మరో ప్రకంపనకు కారణమైందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు కానీ, వ్యవస్థలు కానీ లేవని చెబుతున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 03:45 AM