భూమికి అనారోగ్యం
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:16 AM
మన శరీరంలోని ప్రాణాధార వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని ప్రధాన సంకేతాలను కీలకంగా భావిస్తారు.
16 ప్రధాన జీవ సంకేతాల్లో ఏడు ప్రమాదకర స్థాయులకు!
భారీగా పెరిగిపోయిన కర్బన, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు
2025లో 0.9శాతం మేర పెరిగిన శిలాజ ఇంధనాల వినియోగం
వేగంగా పెరుగుతున్న భూతాపం.. పరిశోధకుల హెచ్చరిక
న్యూయార్క్, అక్టోబరు 15: మన శరీరంలోని ప్రాణాధార వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని ప్రధాన సంకేతాలను కీలకంగా భావిస్తారు. అవి.. రక్తపోటు, నాడి రేటు/గుండె కొట్టుకునే వేగం, శ్వాసక్రియ రేటు, శరీర ఉష్ణోగ్రత. వీటిని ‘వైటల్ సైన్స్’ అంటారు. ఇదే కోవలో.. భూమి ఆరోగ్యం బాగా ఉందో లేదో తెలుసుకోవడానికి 16 ‘వైటల్ సైన్స్’ ఉంటాయి. వాటిలో ఏడు.. మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయులకు చేరాయని అమెరికాలోని ‘ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ’ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఇంధన సంబంధిత కర్బన ఉద్గారాలు చరిత్రలో తొలిసారి 41 గిగాటన్నులను దాటాయని తేలింది. ‘2026 స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్’ పేరిట వారు రూపొందించిన అధ్యయన నివేదిక.. ‘బయోసైన్స్’ తాజా జర్నల్లో ప్రచురితమైంది. ఆ నివేదిక ప్రకారం..
వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ (సీవో2) స్థాయులు 2026 మే నాటికి 428 పార్ట్స్ పర్ మిలియన్కు చేరుకున్నాయి. అంటే.. ప్రతి పది లక్షల అణువుల్లో 428 కార్బన్డయాక్సైడ్ అణువులే. ఇది పారిశ్రామిక విప్లవానికి ముందుకంటే దాదాపు 50 శాతం అధికం.
వాతావరణ మీథేన్ (సీహెచ్4) మునుపెన్నడూ లేనంత స్థాయిలో అత్యధికంగా 1,940 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్)కి చేరుకున్నాయి. కార్బన్డయాక్సైడ్తో పోలిస్తే మీథేన్ స్థాయులు తక్కువగా అనిపించవచ్చు. కానీ.. వాతావరణంలో వేడిని పట్టి ఉంచడం (భూమిని వేడెక్కించడం)లో కార్బన్డయాక్సైడ్ కన్నా మీథేన్ 28-36 రెట్లు శక్తిమంతమైనది. కాబట్టి దీని స్థాయులు పార్ట్స్ పర్ బిలియన్లలో ఉన్నా ప్రమాదమే. వాతావరణ నైట్రస్ ఆక్సైడ్ (ఎన్2వో) కూడా రికార్డు స్థాయిలో 340 పీపీబీకి పెరిగింది. భూమిని వేడెక్కించడంలో.. ఇది సీవో2 కన్నా 265 నుంచి 298 రెట్లు శక్తిమంతమైనది.
భూతాపం కారణంగా మంచు కరిగి సముద్రాల్లోకి చేరడం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్ర మట్టాలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను గ్రహించడం వల్ల వాటి ఉపరితల జలాలు బాగా వేడెక్కాయి. అదే ప్రస్తుతం సూపర్ ఎల్నినోకి కారణం.
గ్రీన్లాండ్ మంచు పొరల మందం (ఐస్ షీట్ మాస్.. అంటే మంచు ద్రవ్యరాశి) చరిత్రలోనే అత్యల్పస్థాయికి పడిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమనీనదాల మందం.. రికార్డుల్లో నమోదు చేయడం ప్రారంభించినప్పటితో పోలిస్తే తగ్గుతూ వచ్చి అత్యంత కనిష్ఠ స్థాయికి చేరుకుంది.