ఇథనాల్‌కు రైట్ రైట్..!
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:46 AM
ఇంధన, ఆటోమొబైల్ రంగాల్లో ఒక చరిత్రాత్మక మార్పు దిశగా కీలక ముందడుగు పడింది. ఇథనాల్‌తో నడిచే వాహనాల తయారీకి మార్గం సుగమం చేస్తూ..
ఈ-100 రూల్స్‌కు కేంద్రం ఆమోదం.. తగ్గనున్న చమురు దిగుమతుల భారం
న్యూఢిల్లీ, జూన్ 14: ఇంధన, ఆటోమొబైల్ రంగాల్లో ఒక చరిత్రాత్మక మార్పు దిశగా కీలక ముందడుగు పడింది. ఇథనాల్‌తో నడిచే వాహనాల తయారీకి మార్గం సుగమం చేస్తూ.. వంద శాతం ఇథనాల్ (ఈ100) నిబంధనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్న ముడిచమురుపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ, పర్యావరణ అనుకూల ఇంధనాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీ ఈ100 నిబంధనలకు పచ్చజెండా ఊపడంతో.. ఇప్పుడు దేశమంతా ‘ఇథనాల్’పై చర్చ నడుస్తోంది. మారుతి సుజుకి, టొయోటా, ఎంజీ, హ్యుందాయ్ వంటి అనేక సంస్థలు ఈ100 ఇంధనంతో నడిచే వాహనాలు తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ100 ఇంధనం అంటే ఏమిటి..? పెట్రోల్ స్థానాన్ని ఇది ఎలా భర్తీ చేయగలదు..? దీనివల్ల లాభాలేమిటి..? నష్టాలేమిటి..? భవిష్యుత్తులో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి..? ఆ వివరాలు తెలుసుకుందాం.
ఈ100 అంటే ఏమిటి..?
ఈ100 అనేది దాదాపు 100శాతం ఇథనాల్‌తో కూడిన ఇంధనం. దీనిలో సాంప్రదాయ పెట్రోల్ ఉండదు. చెరకు, మొక్కజొన్న, పాడైన ఆహార ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారుచేసే పునరుత్పాదక ఇంధనం ఇది. భారత్‌లో ఇప్పటికే ఈ20 పెట్రోల్‌ను వాహనదారులు వినియోగిస్తున్నారు. అంటే దీనిలో 20శాతం ఇథనాల్, 80శాతం పెట్రోల్ ఉంటుంది. ఈ ప్రయాణంలో మరింత ముందుకు సాగాలని భావిస్తున్న భారత్.. 100 శాతం ఇథనాల్‌తో కూడిన ఈ100 ఇంధన ప్రమాణాలకు అనుమతి ఇచ్చింది.
భారత్ ఎందుకు ప్రోత్సహిస్తోంది..?
ప్రస్తుతం భారత్ తన ముడిచమురు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతోంది. అయితే ప్రపంచ చమురు ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ100ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ100 ఇంధనాన్ని విస్తృతంగా వినియోగిస్తే.. స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ దేశంలో ఇంధన భద్రతను పెంచుతుంది. దీనివల్ల దిగుమతి వ్యయం తగ్గుతుంది. ఇథనాల్ వాడకం పెరిగితే చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ ఏర్పడి రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఇథనాల్‌తో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గి గాలి కాలుష్యం తగ్గుతుంది.
పెట్రోల్ స్థానాన్ని భర్తీ చేస్తుందా..?
ఈ100 ఇంధనం పెట్రోల్ స్థానాన్ని భర్తీ చేయగలదా...అంటే భారతీయ మార్కెట్‌లో ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడిచేలా కొత్తగా రూపొందించిన వాహనాల్లో ఈ100ను వినియోగించవచ్చు. కానీ..ఇప్పటికే ఉన్న వాహనాలు ఈ20 ఇంధనంతో మాత్రమే నడవగలవు. వీటిలో ఈ100 వాడడం అసాధ్యం. దీని కోసం ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలు అందుబాటులోకి రావాలి.
ఏ వాహనాలు అనుకూలం..?
ఈ100 ఇంధనం అన్ని రకాల వాహనాల్లో వినియోగించలేరు. దీనికోసం వాహనాల ఇంజిన్‌ను ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుంది. ఇథనాల్ కోసం ఇంజిన్ కాలిబ్రేషన్, ఇంజెక్టర్లు, ఫ్యూయెల్ పంపులు, ఫ్యూయెల్ లైన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మారుతీ సుజీకి సంస్థ తన వ్యాగన్-ఆర్ కారుని ఫ్లెక్స్-ఫ్యూయెల్‌గా రూపొందించింది. అంటే పెట్రోల్‌తోనూ, అవసరమైనప్పుడు ఇథనాల్‌తోనూ నడిచేలా ఈ కారు ఇంజిన్‌ను రూపొందించింది. మిగతా కంపెనీలు కూడా ఇదే ప్రయత్నాల్లో ఉన్నాయి.
సవాళ్లు..
పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌కు తక్కువ శక్తి ఉంటుంది. దీనివల్ల మైలేజ్ దాదాపు 20 నుంచి 30 శాతం పడిపోతుంది.
ఇథనాల్‌కు తేమను గ్రహించే గుణం ఉంటుంది. దీనివల్ల ఇంజిన్‌లోని భాగాలు తుప్పుపట్టే అవకాశం ఉంటుంది.
ఇంధన కేంద్రాలు పెద్ద ఎత్తున ఈ100 ఇంధనాన్ని నిర్వహించగల నిల్వ, పంపిణీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.