Share News

దుబాయిలో రాజకీయ డ్రామా !

ABN , Publish Date - Nov 30 , 2026 | 03:53 AM

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులే ప్రధాన అంశంగా సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దుబాయి వేదికగా రాజకీయ డ్రామా చోటు చేసుకుంది.

దుబాయిలో రాజకీయ డ్రామా !

  • వైద్యం కోసం అక్కడి ఆస్పత్రికి కేరళం కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌

  • ఆయన డిశ్చార్జి విషయంలో జాప్యం

  • పార్లమెంట్‌కు రాకుండా అడ్డుకునే కుట్రని కుటుంబం ఆరోపణ

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులే ప్రధాన అంశంగా సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దుబాయి వేదికగా రాజకీయ డ్రామా చోటు చేసుకుంది. వైద్యం కోసం దుబాయిలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన కేరళంకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ కె.సుధాకరన్‌ తిరిగి స్వదేశానికివెళ్లకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన కుటుంబసభ్యులు, కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సుధాకరన్‌ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకాకుండా చేసేందుకు యత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నరాల వ్యాధి తో బాధపడుతున్న కన్నూర్‌ ఎంపీ సుధాకరన్‌ వైద్యం కోసం అబుదాబీ మీదుగా అమెరికా బయలుదేరారు. అయితే, మార్గమధ్యలో కాంగ్రెస్‌ పార్టీ ఆదేశానుసారం అమెరికా ప్రయాణం విరమించుకొని వైద్య సలహా కోసం దుబాయిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి శుక్రవారం వచ్చారు. రోగి, అతని కుటుంబసభ్యుల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఆ ఆస్పత్రి వర్గాలు సదరు ఎంపీని ఐసీయూకు తరలించడమే కాక ఆయన్ను చూసేందుకు అనుమతించడంలేదనేది కుటుంబసభ్యుల ఆరోపణ. పైగా, సుధాకరన్‌ పేరుతో తమ ఆస్పత్రిలో రోగి లేరని ఓసారి, న్యూఢిల్లీకి చెందిన ఓ అధికారిక పెద్ద సూచన మేరకు చికిత్స చేస్తున్నామని మరోసారి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయని పేర్కొన్నారు.


దీంతో అనుమానించిన కుటుంబీకులు విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు రమేశ్‌ చెన్నితాల, కేసీ వేణుగోపాల్‌తోపాటు రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఓ స్థానిక న్యాయవాది జోక్యం చేసుకోగా... రోగికి ఏం జరిగినా బాధ్యత తనదేనంటూ ఎంపీ కొడుకు సంజోగ్‌ నుంచి లిఖితపూర్వక హామీ తీసుకున్న ఆస్పత్రి వర్గాలు ఎంపీ సుధాకరన్‌ను ఆదివారం డిశ్చార్జి చేశాయి. కానీ ప్రయాణానికి ముందు ఆస్పత్రి నుంచి అనుమతి పొందాలని షరతుపెట్టగా.. వేరే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసుకొని అనుమతి తీసుకొంటామని ఎంపీ కుటుంబం స్పష్టం చేసింది. కాగా, ఎంపీ సుధాకరన్‌ ఆదివారం రాత్రి దుబాయ్‌ నుంచి బయలుదేరారని, సోమవారం ఉదయానికి ఢిల్లీ చేరుకుంటారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Nov 30 , 2026 | 03:54 AM