డ్రైవింగ్ లైసెన్స్‌కు గ్రేడింగ్ పాయింట్లు
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:05 AM
రోడ్డు నిబంధనలు పాటిస్తూ బాధ్యతగా ప్రవర్తించేవారు కొందరైతే.. రూల్స్ ఉన్నవి బ్రేక్ చేయడానికే అని భావించే ర్యాష్ డ్రైవర్లు మరికొందరు. బాధ్యత లేకుండా రయ్.. రయ్.. మంటూ రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాలకు..
లైసెన్స్‌తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు లింక్
హద్దుమీరితే పాయింట్లలో కోత: గడ్కరీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: రోడ్డు నిబంధనలు పాటిస్తూ బాధ్యతగా ప్రవర్తించేవారు కొందరైతే.. రూల్స్ ఉన్నవి బ్రేక్ చేయడానికే అని భావించే ర్యాష్ డ్రైవర్లు మరికొందరు. బాధ్యత లేకుండా రయ్.. రయ్.. మంటూ రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లను అదుపు చేయడం ఎలా?. దొరికినప్పుడు పెనాల్టీలు వేస్తే సరిపోతుందా? జరిమానా డబ్బు కట్టేస్తే జవాబుదారీతనం వచ్చేస్తుందా? వారు మళ్లీ మళ్లీ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉంటారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం డ్రైవింగ్‌కు గ్రేడ్ పాయింట్లు. మన దేశంలో ఏటా 5 లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో సుమారు 1.80 లక్షల మంది చనిపోతున్నారు. ఈ ప్రమాదాలకు ఎక్కువ శాతం డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. డ్రైవర్లు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రమాదాలు తగ్గడం లేదు. అందుకే డ్రైవర్లలో బాధ్యత పెంచడానికి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కొత్త గ్రేడింగ్ పాయింట్ల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఆ వ్యవస్థ ఎలా ఉండబోతుందనే విషయం ఆయన గురువారం ఢిల్లీలో జరిగిన సియామ్ వార్షిక సదస్సులో వివరించారు. వాహనాల రిజిస్ట్రేషన్ల సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం గ్రేడెడ్ పాయింట్ల వ్యవస్థను తేవాలన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘలనకు పాల్పడితే పాయింట్లలో కోత పెట్టాలని, పాయింట్లలో కోత నిర్ణీత పరిమితికి చేరితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ప్రతిపాదించారు. అంతేకాదు బాధ్యతతో నిబంధనలు పాటించే వారికి రివార్డులు కూడా ఇవ్వాలన్నారు. ప్రతిపాదిత వ్యవస్థకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
పాయింట్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది
డ్రైవింగ్ లైసెన్స్ రికార్డును, ట్రాఫిక్ ఉల్లంఘనలను లింక్ చేసే వ్యవస్థ ఉంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్ల సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులకు గ్రేడింగ్ పాయింట్లు ఉంటాయి. ప్రతి ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనకు పెనాల్టీతో పాటు డ్రైవింగ్ లైసెన్సు పాయింట్లలో కోత పెడతారు. పాయింట్ల పరిమితిని పెనాల్టీలు దాటిన తర్వాత అధికారులు రంగంలోకి దిగి నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై చర్యలు చేపడతారు. అతని డ్రైవింగ్ లైసెన్సును రద్దు కూడా చేయవచ్చు.
బాధ్యతగా ఉంటే రివార్డులు
ప్రతిపాదిత వ్యవస్థ కేవలం పెనాల్టీలకే పరిమితం కాదు. నిబంధనలు పాటిస్తూ మంచి డ్రైవింగ్ రికార్డు ఉన్నవారికి ప్రయోజనాలు కూడా ఉంటాయి. బీమా కంపెనీల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ రివార్డులు ఎలా ఉంటాయనేది కొత్త వ్యవస్థ కార్యరూపం దాల్చిన తర్వాత తెలుస్తుంది.
డ్రైవర్ల ప్రవర్తనపైనా దృష్టి
పదే పదే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే తమ ప్రవర్తనకు డ్రైవర్లు జవాబుదారీగా ఉండేలా కొత్త వ్యవస్థ పనిచేస్తుంది. జరిమానా కట్టేస్తే సరిపోతుందనే డ్రైవర్ల ఆలోచనకు చెక్ పడుతుంది. ఒకేసారి జరిమానా వేయడంతో పోల్చితే పాయింట్ల ఆధారిత విధానం డ్రైవర్లలో బాధ్యత పెంచుతుంది. తరచూ పాల్పడే ఓవర్‌స్పీడ్, సిగ్నల్ జంప్, ప్రమాదకర డ్రైవింగ్ ఉల్లంఘనలకు వేర్వేరుగా జరిమానాలు వేయడం కంటే అన్నింటిని కలిపి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడానికి ఈ కొత్త విధానం అవకాశం కల్పిస్తుంది.