Share News

ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి.. 2వేల కి.మీ ప్రయాణించి

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:52 AM

‘దృశ్యం’ సినిమా స్ఫూర్తితో కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు ఓ కుమారుడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తన ఫోన్‌ స్విచాఫ్‌ చేసి.. దాదాపు 2,000 కి.మీ. ప్రయాణం చేసి వచ్చి తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు.

ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి.. 2వేల కి.మీ ప్రయాణించి

  • దృశ్యం సినిమా స్ఫూర్తితో తండ్రిని చంపిన కుమారుడు

న్యూఢిల్లీ, అక్టోబరు 4: ‘దృశ్యం’ సినిమా స్ఫూర్తితో కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు ఓ కుమారుడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తన ఫోన్‌ స్విచాఫ్‌ చేసి.. దాదాపు 2,000 కి.మీ. ప్రయాణం చేసి వచ్చి తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. అయితే హత్యచేసి వెళ్తూవెళ్తూ మార్గమధ్యంలో తన భార్యకు చేసిన ఒకే ఒక్క ఫోన్‌ కాల్‌తో అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన జూలై 26న బిహార్‌లో జరిగింది. సమస్తీపూర్‌ జిల్లా దర్వా గ్రామానికి చెందిన శివశంకర్‌(26) ఉపాధి నిమిత్తం సూరత్‌ వెళ్లి కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. తమ కుటుంబానికి చెందిన భూమి అమ్మకం విషయంలో తండ్రి రఘువీర్‌ సాహ్ని (50)తో అతనికి గొడవలు ఉన్నాయి. దీంతో తండ్రిని చంపేయాలనుకున్న అతడు దృశ్యం సినిమా తరహాలో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సూరత్‌లోనే తన ఫోన్‌ను స్విచాఫ్‌ చేసి.. 2వేల కిలోమీటర్లు ప్రయాణించి సొంత గ్రామానికి చేరుకున్నాడు. జూలై 26వ తేదీ అర్ధరాత్రి సమయంలో వెనుక గుమ్మం ద్వారా లోపలికి ప్రవేశించి తండ్రిపై గొడ్డలితో దాడిచేసి చంపేశాడు. వెంటనే సూరత్‌కు తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో బిహార్‌లోని పటోరి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఫోన్‌ ఆన్‌చేసి తన భార్యకు కాల్‌ చేసి మాట్లాడాడు. వెంటనే మళ్లీ స్విచాఫ్‌ చేశాడు. అయితే, శివశంకర్‌ తండ్రి అంత్యక్రియలకు హాజరు కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేయగా అతడే హంతకుడని తేలిసింది. విచారణలో అతడు ‘దృశ్యం’ స్ఫూర్తితో ఈ హత్యకు ప్లాన్‌ చేసినట్టు చెప్పాడు.

Updated Date - Oct 05 , 2026 | 05:52 AM