ట్రంప్ ప్రజామోదం ఢమాల్!
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:40 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఉన్న ప్రజామోదం నానాటికీ క్షీణిస్తోంది. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో ఆయన పనితీరు పట్ల అత్యధికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏకంగా మైనస్ 17కు పడిపోయిన రేటింగ్
అమెరికా అధ్యక్షులందరికంటే అత్యల్పం
ఇరాన్ యుద్ధంపైనా 63 శాతం వ్యతిరేకత
న్యూఢిల్లీ, మార్చి 31: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఉన్న ప్రజామోదం నానాటికీ క్షీణిస్తోంది. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో ఆయన పనితీరు పట్ల అత్యధికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఎఫ్ పోస్ట్ సంస్థ ‘ఎక్స్’లో చేసిన వీడియో పోస్టు ప్రకారం.. ట్రంప్ ప్రజామోద రేటింగ్ ఏకంగా మైనస్ 17కు పడిపోయింది. ఆయన రెండో పదవీకాలంలో ఇదే అత్యల్పం. పదవిలో ఉన్న సమయంలో ఏ ఒక్క అమెరికా అధ్యక్షుడికీ ఇంత తక్కువ రేటింగ్ లభించలేదు. 2016 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన మొదటి పదవీకాలంలో ట్రంప్ చాలావరకూ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నారు. దానికి భిన్నంగా ఆయన రెండో విడత సానుకూల రేటింగ్‌తో ప్రారంభమైనా, ఆ తర్వాత దారుణంగా పడిపోయింది. మాజీ అధ్యక్షులుజో బైడెన్, జిమ్మీ కార్టర్, రోనాల్డ్ రీగన్ తదితరులతో పోలిస్తే ట్రంప్ రేటింగ్ అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారిందని ఏఎఫ్ పోస్ట్ వెల్లడించింది. అలాగే, మార్చి 26న ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వే ప్రకారం ట్రంప్ ప్రజామోద రేటు 41 శాతంగా నమోదైంది. సర్వేలో పాల్గొన్నవారిలో 59ు మంది ఆయన పనితీరును వ్యతిరేకించారు. ఇది ఆయన రెండు పదవీకాలాల్లోనూ నమోదైన అత్యధిక వ్యతిరేకత కావడం గమనార్హం. కాగా, గతఏడాది మార్చిలో ట్రంప్‌నకు రిపబ్లికన్ల మద్దతు 92ు ఉండగా ఇప్పుడది 84 శాతానికి పడిపోయింది. డెమోక్రాట్లలో 95ు మంది ఆయన పనితీరుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.