Share News

శ్రుతి మించిన కుటుంబ పాలన

ABN , Publish Date - May 05 , 2026 | 04:29 AM

ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలుచేసినా, నగదు పంపిణీ చేసినా డీఎంకే ఘోరంగా ఎలా ఓడిపోయిందన్నది అంతుబట్టని ..

శ్రుతి మించిన కుటుంబ పాలన

  • మంత్రుల తీరుతో సర్కారుకు చెడ్డపేరు

  • ఉదయనిధి వ్యాఖ్యలతో తలనొప్పులు

  • డీఎంకే పరాజయానికి కారణాలివే..

చెన్నై, మే 4 (ఆంధ్రజ్యోతి): ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలుచేసినా, నగదు పంపిణీ చేసినా డీఎంకే ఘోరంగా ఎలా ఓడిపోయిందన్నది అంతుబట్టని ప్రశ్న. అయితే కొన్ని కీలకమైన అంశాల్లో డీఎంకే ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సున్నితమనస్సు కలిగిన, ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే నేతగా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పేరుంది. అయినా ఆయన ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఆ పార్టీ పరాజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. మద్యం విక్రయ దుకాణాలలో బాటిల్‌పై అదనంగా రూ.10 తీసుకోవడం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఉద్యోగాలు కల్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసినట్టు ఓ మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపాయి. ఇక మహిళలపై వరుస అత్యాచారాలు, శాంతిభద్రతల సమస్య చర్చకు దారితీశాయి. కుటుంబపాలన కూడా నేతలు, కార్యకర్తల్లో వెగటు పుట్టించింది. అధికారిక కార్యక్రమాల్లో స్టాలిన్‌ భార్య, అల్లుడు, కుటుంబసభ్యులు మితిమీరిన జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు రేగాయి. ‘సనాతన ధర్మం కరోనా లాంటిది’ అంటూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఆయనపై హిందూ వ్యతిరేకి ముద్రవేశాయి. సినీరంగంలోనూ ఉదయనిధి కుటుంబ పెత్తనం పెరిగింది. నిర్మాణం నుంచి డిస్ట్రిబ్యూషన్‌ వరకు ఆ కుటుంబం చేతుల్లోనే ఉన్నట్టు జరిగిన ప్రచారం ప్రతికూల ప్రభావం చూపింది.

Updated Date - May 05 , 2026 | 04:29 AM