దిశా శాలియన్ మృతి కేసు.. ఎఫ్ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా చక్రవర్తి పేర్లు
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:05 PM
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో సీబీఐ సోమవారం ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో సీబీఐ సోమవారం ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పలువురిపై దర్యాప్తు జరపాలని పేర్కొంది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య ఠాక్రే, నటుడు డీనోమోరియా, రియా చక్రవర్తి, సూరజ్ పాంచోలిపై దర్యాప్తు జరపాలని పేర్కొంది. ఈ జాబితాలో మాజీ పోలీసు అధికారి సచిన్ వేజ్, మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్, ఇతర పోలీసు, ప్రభుత్వ అధికారుల పేర్లను కూడా సీబీఐ చేర్చింది.
కేసు బయటకు రాకుండా పన్నిన కుట్రలో పలువురు కీలక పాత్ర పోషించారని సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. కేసుకు సంబంధించిన దస్త్రాలు, ఇతర విషయాలను ధ్వంసం చేయడంలో పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారుల పాత్ర ఉందని కూడా తెలిపింది. ప్రభుత్వ నిధులు, సిబ్బంది దుర్వినియోగం వంటి అంశాలు కూడా ఈ కేసుతో ముడిపడి ఉన్నాయని చెప్పింది. నిందితులను రక్షించే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది.
ఈ కేసులో ముంబై పోలీసుల విచారణపై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తును ప్రారంభించింది. 2020 జూన్ 8న దిశా శాలియన్ ఓ భవనం నుంచి పడి మృతి చెందారు. ఆ తరువాత ఆరు రోజులకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా తన ఇంట్లో విగతజీవిగా కనిపించాడు. రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్టు సీబీఐ ఇప్పటికే క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. అయితే, దిశా శాలియన్ కేసులో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది.
ఈ వార్తలనూ చదవండి:
'సెమికాన్ ఇండియా'.. హాజరుకానున్న 600కు పైగా గ్లోబల్ దిగ్గజాలు
నేడు ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్