Share News

డిజిటల్‌ అరెస్టుతో రూ.24 కోట్లు కొట్టేశారు

ABN , Publish Date - May 25 , 2026 | 05:03 AM

కర్ణాటకలో సైబర్‌ నేరాలు ఆగడంలేదు. వృద్ధులను, వ్యాపారులను టార్గెట్‌ చేసుకుని డిజిటల్‌ అరెస్టు పేరిట కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు.

డిజిటల్‌ అరెస్టుతో రూ.24 కోట్లు కొట్టేశారు

  • బాధితురాలు రిటైర్డు టీచర్‌ .. బెంగళూరులో ఘరానా దోపిడీ

  • పోలీసుల విచారణ.. ఐదుగురు నిందితుల అరెస్టు

బెంగళూరు, మే 24(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సైబర్‌ నేరాలు ఆగడంలేదు. వృద్ధులను, వ్యాపారులను టార్గెట్‌ చేసుకుని డిజిటల్‌ అరెస్టు పేరిట కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. ఇలా సైబర్‌ నేరగాళ్ల బారిన పడి ఓ రిటైర్డ్‌ టీచర్‌ ఐదు నెలల్లో ఏకంగా రూ.24కోట్లు పోగొట్టుకున్న ఉదంతం ఆదివారం వెలుగులోకి వచ్చింది. బెంగళూరు నగరం శివాజీనగర్‌లో నివసించే లక్ష్మీరామమూర్తి దుబాయ్‌లో టీచర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఈమెకు బెంగళూరు, ముంబైలలో ఆస్తులున్నాయి. వాటిని విక్రయించి అమెరికాలో నివసిస్తున్న పిల్లల వద్దకు వెళ్లిపోయి జీవిత చరమాంకాన్ని గడపాలని భావించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఆమెకు మోసగాళ్లు వీడియోకాల్‌ చేసి సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. నగదు అక్రమ బదిలీ చేశారనీ, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారనీ ఆమె గురించి కొన్ని వివరాలు చెప్పారు. దీంతో ఆమె భయపడ్డారు. మీ ఖాతాలను పరిశీలించాలని, మధ్యలో ఎవరితోనూ మాట్లాడరాదని బెదిరిస్తూ.. ఆర్‌టీజీఎస్‌ ద్వారా వివిధ ఖాతాలకు నగదు బదిలీ చేయించుకున్నారు. ఇలా గత ఐదు నెలల కాలంలో పలు దఫాలుగా ఆమె నుంచి రూ.24 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. అయినా వారు వేధింపులు ఆపలేదు. దీంతో బాధితురాలు ఇంట్లో ఉన్న 1.3 కిలో బంగారం ఆభరణాలను తాకట్టు పెట్టేందుకు ఐసీఐసీఐ కంటోన్మెంట్‌ బ్యాంకు శాఖకు వెళ్లారు. కేజీ కంటే ఎక్కువ బంగారం తాకట్టు పెట్టేందుకు వృద్ధురాలు రాగా బ్యాంకు మేనేజర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వృద్ధురాలిని విచారించారు. తొలుత ఏవేవో అబద్ధాలు చెప్పిన ఆమె.. చివరికి వీడియోకాల్‌ ద్వారా వేధిస్తున్నారని, ఇప్పటికే కోట్లు ముట్టజెప్పానని ఘెల్లుమన్నారు. సీసీబీ పోలీసులు డిజిటల్‌ అరెస్టుగా పరిగణించి కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించి ముంబై, ఢిల్లీ, అలహాబాద్‌లో మోసగాళ్లను గుర్తించి గౌరవ్‌కుమార్‌, ఓం ప్రకాశ్‌ రాజ్‌పుత్‌తో కలిపి ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితులకు చెందిన 20కి పైగా బ్యాంకు ఖాతాలలోని 3కోట్ల నగదును ఫ్రీజ్‌ చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Updated Date - May 25 , 2026 | 05:03 AM