దొడ్ల డెయిరీ పాల నమూనాలో డిటర్జెంట్, కాస్టిక్ సోడా
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:22 AM
తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన దొడ్ల డెయిరీ పాల నమూనాలో డిటర్జెంట్/కాస్టిక్ సోడా ఉన్నట్లు బయటపడింది. జాతీయ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ విషయాన్ని ప్రకటించింది.
వినియోగానికి పనికిరావని తేల్చిన ఫుడ్ ల్యాబొరేటరీ
ప్రియాగోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా
యూఈఐఆర్ ఎండుద్రాక్షలపై పురుగు మందు అవశేషాలు
మూడు సంస్థలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన దొడ్ల డెయిరీ పాల నమూనాలో డిటర్జెంట్/కాస్టిక్ సోడా ఉన్నట్లు బయటపడింది. జాతీయ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ విషయాన్ని ప్రకటించింది. కంపెనీ ప్లాంట్ నుంచి సేకరించిన ఫుల్ క్రీమ్ పాల నమూనాను విశ్లేషణకు పంపగా.. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో, దీన్ని నాసిరకమైనదిగా ఫుడ్ అనలిస్ట్ ధ్రువీకరించారు. కంపెనీ దీనిపై అప్పీల్ చేయగా.. రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పరీక్షల కోసం పంపించారు. డిటర్జెంట్/కాస్టిక్ సోడా ఉన్నందున వినియోగానికి పనికిరావని.. నిర్ణీత పరిమితి కంటే తక్కువ మిల్క్ ఫ్యాట్ను గుర్తించడంతో ప్రమాణాలకు అనుగుణంగా లేదని నివేదిక వచ్చింది. ఇక, ప్రియాగోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణాలో వినియోగించే తవుడును గుర్తించారు. ఒక వినియోగదారుడి ఫిర్యాదు ఆధారంగా సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో సంస్థ తయారీ కేంద్రంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిపుణుల బృందం తనిఖీ నిర్వహించింది. ప్రియాగోల్డ్ బిస్కెట్ల తయారీలో పశువుల దాణాకు ఉద్దేశించిన తవుడును వినియోగించారని, ఇది మానవ వినియోగానికి పనికిరాదని తేలింది. ఆయా గోనె సంచులపై ‘పశువుల దాణా’ అని రాసి ఉండడాన్ని గుర్తించారు. దీంతో సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో లైసెన్స్ను లోగడే సస్పెండ్ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఇప్పుడు ఆ సంస్థపై ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించింది. యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్ ఎల్లో రైజిన్స్ (ఎండుద్రాక్ష/కిస్మి్స)లో పురుగు మందు అవశేషాలు ఉన్నట్లు వెలుగు చూడడంపై ఆ సంస్థపైనా చట్టపరమైన చర్యలను ఎఫ్ఎస్ఎస్ఏఐ చేపట్టింది.