48 గంటల్లోపు అదనపు చార్జీలు ఉండవ
ABN , Publish Date - Feb 27 , 2026 | 03:59 AM
టికెట్లు రద్దు, మార్పు విషయంలో విమాన ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెసులుబాటు కల్పించింది...
విమాన టికెట్ల మార్పు, రద్దుకు అవకాశం
రిఫండ్ నిబంధనల్లో మార్పులు చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: టికెట్లు రద్దు, మార్పు విషయంలో విమాన ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెసులుబాటు కల్పించింది. టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఆ టికెట్‌లో మార్పులు చేయాలన్నా, రద్దు చేసుకున్నా కూడా అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీని కోసం టికెట్ రిఫండ్ నిబంధనలను సవరించింది. అయితే టికెట్ బుక్ చేసుకున్న 7 రోజుల లోపు దేశీయ ప్రయాణం, టికెట్ బుక్ చేసుకున్న 15 రోజుల్లోపు అంతర్జాతీయ ప్రయాణం ఉంటే ఈ సదుపాయం వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. అలాగే పేరులో తప్పును గుర్తించి 24 గంటల్లోపు ప్రయాణికుడు తెలియజేస్తే, ఆ మార్పునకు ఏవిధమైన చార్జీలు వసూలు చేయకూడదని విమాన సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఏజెంట్లు, పోర్టల్ ద్వారా కొన్న టికెట్ డబ్బులను వాపసు చేయాల్సి వస్తే 14 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఒకే పీఎన్‌ఆర్ ఉన్న టికెట్‌లో ఎవరైనా ప్రయాణికుడు ప్రయాణ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీతో ఆస్పత్రిలో చేరితే సదరు టికెట్ డబ్బు వాపస్ చేయడంగానీ, క్రెడిట్ షెల్‌కు బదిలీ చేయడంగానీ చేయాలని విమాన సంస్థలను ఆదేశించింది. టికెట్ రద్దు, డబ్బు వాపస్ విషయంలో వచ్చిన ఫిర్యాదులతో సివిల్ ఏవియేషన్ రిక్వయిర్‌మెంట్స్ (సీఏఆర్) నిబంధనల్లో మార్పులు చేశారు.